ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై భారత్ స్పందించింది. వెంటనే పరిస్థితులు చక్కబెట్టడానికి ఇతర దేశాలు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చింది. ఉక్రెయిన్‌లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి వివరించారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో రోజు రోజుకూ పరిస్థితులు దిగజారి పోతున్నాయి. మానవ సంక్షోభం అంచుల్లోకి వెళ్తున్నదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చేయిదాటి పోకుండా ప్రపంచ దేశాలు వెంటనే సిద్ధం కావాలని పిలుపు ఇచ్చింది. ఉక్రెయిన్‌లో బాంబులు, క్షిపణుల దాడికి బలైన, ముప్పు ఎదుర్కొంటున్న కుటుంబాల కోసం అత్యవసరంగా చర్రయలు తీసుకోవాలని కోరింది. మానవత్వం, తటస్థం, నిష్పక్షపాతం, స్వేచ్ఛ ప్రాతిపదికన ఉక్రెయిన్‌లో ప్రజలకు సహకరించి వారిని ముప్పు నుంచి కాపాడుకోవాలని వివరించింది. ఈ చర్యలను రాజకీయం చేయరాదని తెలిపింది.
ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతితో ఉన్నదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి రోజు రోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయని వివరించారు. పౌరుల మరణాలు జరుగుతున్నాయని, శరణార్థులు, నిరాశ్రయులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాంబులు పడుతున్న ఘర్షణాయుత ప్రాంతాల్లో మానవ జీవన స్థితిగతులు క్షీణించిపోతున్నాయని వివరించారు.
భారత్ ఇప్పటి వరకు రష్యా దాడులను ఖండించలేదు. అలాగని, సమర్థించనూ లేదు. అయితే, రష్యా దాడులను వెంటనే నిలిపేయాలని భారత్ కోరింది. శాంతియుత మార్గంలో పరిష్కారాన్ని అన్వేషించాలని సూచనలు చేసింది. తాజాగా, ఉక్రెయిన్ ప్రజల దుస్థితి గురించి కలతను వ్యక్తం చేసింది.
తీరప్రాంత నగరమైన మేరియుపొల్ నగరంపై రష్యాన్ సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే నగరంలోని ఒక థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. దాడి సమయంలో వెయ్యి మందికిపైగా తలదాచుకుంటున్నారు. ఇందులో సగానికి పైగా చిన్నారులు, మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ఈ ఘటనపై స్థానిక డిప్యూటీ మేయర్ సెర్గీ ఓర్లోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో బుధవారం భారీ ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో అందులో వెయ్యి నుంచి 1200 మంది వరకు పౌరులు తలదాచుకున్నారని తెలిపారు. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారన్నది తెలియరాలేదు. కానీ, భారీ సంఖ్యలోనే మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్ విడుదల చేసిన ఫోటోలను పరిశీలిస్తే.. ఆ థియేటర్ మాత్రం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మాట్లాడుతూ.. రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగానే పౌరులపై మారణహోమానికి పాల్పడ్డాయని విమర్శించారు. మారియుపోల్‌లో జరిగిన మరో భయంకరమైన యుద్ధ నేరమనీ, ఇది పౌర ఆశ్రయం.. దీనిపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడులని ఆరోపించారు. ఈ దాడి సమయంలో వందలాది మంది పిల్లలు, వృద్ధులు ఈ థియేటర్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.
ఈ దాడి అనంతరం.. మార్చి 14న US కంపెనీ Maxar తీసిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఆ ఫోటోల్లో భవనం వెలుపల పేవ్‌మెంట్‌పై "పిల్లలు" అనే పదాన్ని రష్యన్ భాషలో వ్రాయబడిందని చూపిస్తుంది. థియేటర్‌పై వైమానిక దాడి చేయలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది, బాంబు దాడిలో ధ్వంసమైన థియేటర్ చిత్రాలను వారు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
