Coronavirus: తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు !
Coronavirus: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతున్నది. నిత్యం లక్షల మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. అయితే, కొత్త కేసులు తగ్గుతుండగా, వైరస్ కారణంగా చినిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Coronavirus: అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారత్ లోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. కోవిడ్-19 థర్డ్ వేవ్ అంచనాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. కరోనా (Coronavirus)మహమ్మారి సాధారణ కేసులతో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. కరోనా కేసులు నిత్యం రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. రోజువారీ (Coronavirus) మరణాలు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ మరణాలు వేయికి చేరువగా నమోదవుతున్నాయి. అయితే, గత మూడు రోజులుగా కొత్తగా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య తగ్గుముంఖం పడుతుండగా, కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,09,918 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు దేశంలో 2.34 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే నిన్నటితో పోల్చుకుంటే 10 శాతం కేసులు తక్కువగా వెలుగుచూశాయి. కానీ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 2,09,918 కరోనా కేసులు మోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్-19 కేసులు 4,13,02,440కు చేరాయి. ఇప్పటివరకు మొత్తం 3,89,76,122 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 2,62,628 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా కొత్తగా 959 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,95,050 కి పెరిగింది. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18,31,268 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 4.43 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదేవిధంగా రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉండగా, వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 5.06 శాతంగా ఉంది.
కాగా, దేశంలో కరోనా మొదటి కేసు నమోదై ఆదివారం నాటికి రెండేండ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి మూడు దశల్లో మహమ్మారి విజృంభించింది. ప్రస్తుతం కరోనా వైరస్ థర్డ్ వేవ్ కొనసాగుతున్నది. ఈ వేవ్ లోనూ నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్, కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 166 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారు 89.4 కోట్ల మంది ఉండగా, రెండు డోసులు తీసుకున్న వారు 70.8 కోట్ల మంది ఉన్నారు.