ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది... ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే ఇరుదేశాల మధ్య పహల్గాం ఉగ్రదాడి మరింత దూరం పెంచింది... యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. మరి యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? భారత్ వ్యూహమేంటి? పాక్ ను దెబ్బతీయాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకుందాం. 

India Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే పాకిస్థాన్ పతనం ఖాయం... ఇందుకోసం భారత్ ఏ వ్యూహాన్ని అనుసరించే అవకాశాలున్నాయో తెలుసుకుందాం. 

భారత సైనిక బలం పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే. సైనిక బలంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. పాకిస్తాన్ మాత్రం టాప్ 10లో కూడా లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం యుద్ధం వస్తే భారత సైన్యం ముందుగా పాకిస్తాన్ వైమానిక దళం దాడిచేసి దాన్ని నిర్వీర్యం చేయాలంటున్నారు. దీనికోసం పాకిస్తాన్ AWACS (Erieye Airborne Early Warning and Control System)ని ధ్వంసం చేయాల్సి ఉంటుందట.

యుద్దంమే అనివార్యం అయితే భారత్ ముందుగా పాకిస్తాన్ AWACS రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయాలి. దీంతో పాకిస్తాన్ యుద్ధ విమానాలు దూరం నుంచి దాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఈ పని మొదటి కొన్ని గంటల్లోనే చేయాలి. AWACS వ్యవస్థ ధ్వంసమైతే పాకిస్తాన్ వైమానిక దళం నౌకాదళం, పాక్ సైన్యంతో సమన్వయం చేసుకోవడం కష్టమవుతుంది.

ఏమిటీ Saab Erieye AWACS రాడార్ వ్యవస్థ? 

పాకిస్తాన్ వైమానిక దళం దగ్గర స్వీడన్‌కు చెందిన సాబ్ ఎలక్ట్రానిక్ డిఫెన్స్ సిస్టమ్స్ కంపెనీ అభివృద్ధి చేసిన Saab 2000 Erieye AWACS రాడార్ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ద్వారా పాక్ యుద్ద విమానాలు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు. ఇది పాకిస్తాన్ వైమానిక దళానికి రియల్ టైంలో కమాండ్, కంట్రోల్ సామర్థ్యాన్నిస్తుంది. దీన్ని పాకిస్తాన్ వైమానిక దళానికి కళ్ళు, చెవులు అని కూడా అంటారు. దీని సాయంతో పాకిస్తాన్ భారత్‌లో చాలా లోపలి వరకు నిఘా పెట్టగలదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం AWACS విమానంపై ఉన్న రాడార్ వ్యవస్థ భారత వైమానిక స్థావరాలను స్కాన్ చేయగలదు. భారత వైమానిక దళం యుద్ధ విమానాలు, క్షిపణి దాడుల ప్రణాళిక గురించి పాకిస్తాన్ వైమానిక దళానికి ముందుగానే సమాచారం అందించగలదు. దీంతో పాకిస్తాన్ రక్షణకు సిద్ధం కావడానికి, ప్రతిదాడికి ప్రణాళిక వేసుకోవడానికి సమయం దొరుకుతుంది.

పాకిస్తాన్ Saab Erieye AWACS వ్యవస్థను భారత్ ఎలా ధ్వంసం చేయగలదు

ప్రపంచంలోనే అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థ S-400 Triumf భారత్ దగ్గర ఉంది. దీంతోపాటు Barak-8ER వైమానిక రక్షణ వ్యవస్థ కూడా ఉంది. S-400ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. దీని క్షిపణితో 400 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయొచ్చు. పాకిస్తాన్ AWACS విమానాలు పాకిస్తాన్‌లో చురుగ్గా ఉన్నప్పుడే S-400తో వాటిని ధ్వంసం చేయొచ్చు.

Barak-8ER, S-400 Triumfలు భారత్‌కు పాకిస్తాన్‌లోని ముఖ్యమైన లక్ష్యాలను ఆ దేశంలో ఉండగానే ధ్వంసం చేసే సామర్థ్యాన్ని ఇచ్చాయి. ఇలా చేస్తే భారత వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక స్థావరంలోకి చొచ్చుకుపోయి వ్యూహాత్మక సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. భారత్ అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ ప్రతిదాడి సామర్థ్యాన్ని చాలా వరకు తగ్గించగలవు. దీంతో భారత యుద్ధ విమానాలకు ముప్పు తగ్గుతుంది.

పాకిస్తాన్ వైమానిక దళాన్ని కుప్పకూల్చే వ్యూహమిదే...

భారత్ S-400 సాయంతో Saab 2000 Erieye వ్యవస్థను ధ్వంసం చేస్తే పాకిస్తాన్ వైమానిక దళం పనికిరాకుండా పోతుంది. పూర్తిగా భూమిపై ఉన్న రాడార్‌లపై ఆధారపడాల్సి వస్తుంది. కఠినమైన పర్వత ప్రాంతాల్లో భూమిపై ఉన్న రాడార్‌లతో పెద్దగా ఉపయోగం ఉండదు.

దీంతో భారత్ లోపలి ప్రాంతాలపై దాడి చేసే పాకిస్తాన్ వైమానిక దళం సామర్థ్యం తగ్గుతుంది. మరోవైపు భారత వైమానిక దళ విమానాలు సులభంగా పాకిస్తాన్‌లోకి వెళ్లి వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేయగలవు.

ఉద్రిక్తతలు పెరగడంతో భారత్ తన S-400, ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తంగా ఉంచింది. S-400 రాడార్‌లు చాలా శక్తివంతమైనవి. వీటితో మొత్తం పాకిస్తాన్‌పై నిఘా పెట్టొచ్చు. పాకిస్తాన్ ఏ వైమానిక స్థావరం నుంచైనా AWACS విమానం లేదా ఇతర యుద్ధ విమానం గాల్లోకి లేస్తే దాని గురించి తెలుసుకోవచ్చు.

AWACS విమానాలు పరిమాణంలో పెద్దవి. యుద్ధ విమానాల కంటే తక్కువ చురుగ్గా ఉంటాయి. వీటి వేగం తక్కువ. అందుకే వీటిని గాల్లోకి దూరం నుంచి దాడి చేసే క్షిపణులతో ధ్వంసం చేయొచ్చు. భారత్ S-400 వ్యవస్థ ఈ పని చేయడానికి సిద్ధంగా ఉంది.