పాకిస్తాన్ చేసిన దాడిని భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. ఇప్పుడు సరిహద్దులోనే కాదు ఆర్థికంగా, దౌత్యపరంగా కూడా పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే పాక్ కు అందే భారీ నిధులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. 

India Pakistan Conflict: పాకిస్తాన్ కు సరిహద్దుల్లోనే బుద్దిచెప్పడం వరకే పరిమితం కాకూడదని భారత్ నిర్ణయించింది. అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్‌ను దెబ్బతీసేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయాలని నిర్ణయించుకుంది. అందుకే పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ నుండి వచ్చే నిధులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

నేడు శుక్రవారం అంటే మే 9న వాషింగ్టన్‌లో జరిగే IMF సమావేశంలో పాకిస్తాన్ ఎక్స్‌టెండెడ్ ఫండింగ్ ఫెసిలిటీ (EFF) సమీక్ష జరుగుతుంది. దీని తర్వాతే పాకిస్తాన్‌కు 1.3 బిలియన్ డాలర్లు (సుమారు 11,300 కోట్ల రూపాయలు) బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వాలా వద్దా అనేది తేలుతుంది. ఈ ఆర్థిక ప్యాకేజీని భారత్ వ్యతిరేకిస్తుంది. పాకిస్ధాన్ కు వ్యతిరేకంగా ఐఎంఎఫ్ వద్ద తన వాదనను వినిపించనుంది. 

ఉగ్రవాద నిధులకు పాకిస్తాన్ అడ్డా కాకూడదు

విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందిస్తూ.. IMF బోర్డు సమావేశంలో భారత కార్యనిర్వాహక డైరెక్టర్ పాకిస్తాన్‌పై గట్టిగా మాట్లాడతారని స్పష్టం చేశారు. భారత్ వైఖరి స్పష్టంగా ఉంది ...'అభివృద్ధి పేరుతో తీసుకున్న డబ్బు ఉగ్రవాదానికి నిధులుగా మారకూడదని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఈ కీలక సమావేశంలో పాకిస్తాన్‌కు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తుంది.

పాకిస్తాన్ ఎన్నిసార్లు బెయిలౌట్ ప్యాకేజీ తీసుకుంది

IMF రికార్డుల ప్రకారం.. పాకిస్తాన్ ఇప్పటివరకు 24 సార్లు బెయిలౌట్ ప్యాకేజీ తీసుకుంది. అయినా పరిస్థితిలో మార్పు లేదు. మన పొరుగు దేశంలో ధరలు తగ్గలేదు, ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపడలేదు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నారు.

పాకిస్తాన్‌కు రుణం రాకపోతే ఏమవుతుంది

IMF రుణం పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి చివరి ఆశ. కానీ భారత్ దీనిని వ్యతిరేకిస్తోంది. ఇలా జరిగి, పాకిస్తాన్‌కు సహాయం అందకపోతే దాని సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.

నిజానికి పాకిస్తాన్ గత 3-4 నెలలుగా ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతోంది... అందుకే IMFతో సహా అనేక దేశాల నుండి సహాయం కోరింది. IMF దాని ఆర్థిక స్థిరత్వం కోసం బెయిలౌట్ ప్యాకేజీని కూడా ఇచ్చింది. పాకిస్తాన్ ఈ సహాయాన్ని అభివృద్ధికి కాకుండా ఉగ్రవాద సంస్థలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుందని, కాబట్టి దాని సహాయాన్ని నిలిపివేయాలని భారత్ ఇంతకు ముందే చెప్పింది.