1947లో బ్రిటిష్ వారి నుండి దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజు ఆగస్టు 15… అందువల్లే ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ తేదీనే స్వాతంత్య్ర దినోత్సవంగా ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?
KNOW
స్వాతంత్య్ర దినోత్సవం… ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలయ్యేరోజు. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆగస్టు 15న జాతీయ వేడుకలు జరుపుకుంటాం. మరి స్వాతంత్య్ర దినోత్సవానికి ఆగస్ట్ 15 నే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? ఇందుకు చారిత్రక, రాజకీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్వాతంత్య్ర పోరాటం:
భారత ప్రజలు దాదాపు రెండు శతాబ్దాలపాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడారు. సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకులు ఈ పోరాటంలో తమ ప్రాణాలను అర్పించారు. 1940 లో అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారత స్వాతంత్య్ర ఉద్యమం వేగవంతం అయ్యింది. బ్రిటిష్ వారు కూడా భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చి తమ దేశానికి వెళ్ళాలని భావించింది.
ఆగస్టు 15 ఎందుకు ఎంచుకున్నారు?
1947లో బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ఈ బాధ్యతను తీసుకున్నారు.
ఆధునిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజున భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలని మౌంట్ బాటన్ భావించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడుల తర్వాత జపాన్ 1945 ఆగస్ట్ 14న లొంగిపోయింది. దీనికి గుర్తుగా 1947, ఆగస్టు 15న భారత దేశానికి అధికారాలు బదిలీ చేయాలని మౌంట్ బాటన్ నిర్ణయించారు. అందువల్లే జూలై 18, 1947న భారత స్వాతంత్య్ర చట్టం ఆమోదించబడినా ఆగస్టు 15 అధికారిక స్వాతంత్య్ర దినోత్సవంగా మారింది.
విభజనతో స్వాతంత్య్రం
స్వాతంత్య్రం భారీ మూల్యంతో వచ్చింది, అదే భారతదేశం, పాకిస్తాన్ విభజన. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 15 వేడుకల రోజు మాత్రమే కాదు, ఆలోచనల రోజు కూడా.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తారు, ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు.. అలాగే విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటాం.
ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. శతాబ్దాల కాలం నాటి వలస పాలన అంతమై, స్వపరిపాలన ప్రారంభమైన రోజు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ రోజును జరుపుకోవడం అవసరం. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కోసం పోరాడిన లక్షలాది మంది త్యాగాలకు ఇది గుర్తింపు.
