Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: భార‌త్ బ‌యోటెక్ ఇంట్రానాస‌ల్ కోవిడ్ టీకా.. ట్ర‌య‌ల్స్ కు గ్రీన్ సిగ్న‌ల్ !

Coronavirus: హైద‌రాబాద్ చెందిన క‌రోనా వ్యాక్సిన్ త‌యారీదారు భార‌త్ బ‌యోటెక్ అభివృద్ది చేస్తున్నఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోస్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) అనుమ‌తి ఇచ్చింది. బూస్ట‌ర్ డోసు థ‌ర్డ్ స్టేజ్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్  నిర్వ‌హించేందుకు డీసీజీఐ నిపుణుల క‌మిటీ ఆదేశాలు జారీ చేసింది.
 

India Gives Nod To Bharat Biotechs Nasal COVID Booster To Conduct Trials
Author
Hyderabad, First Published Jan 28, 2022, 4:08 PM IST

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌కు బూస్ట‌ర్ డోసులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్ చెందిన క‌రోనా వ్యాక్సిన్ త‌యారీదారు భార‌త్ బ‌యోటెక్ అభివృద్ది చేస్తున్నఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోస్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) అనుమ‌తి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఆదేశాలు శుక్ర‌వారం నాడు విడుద‌ల చేసింది. కాగా, భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోస్ ట్రయల్స్ నిర్వహించడానికి దేశంలోని తొమ్మిది వేర్వేరు ప్రదేశాలలో  నిర్ణ‌యించింది. అంతకుముందు, DGCI దాని ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కోసం “ఫేజ్ III సుపీరియారిటీ స్టడీ, ఫేజ్ III బూస్టర్ డోస్ స్టడీ” ట్రయల్స్ నిర్వహించడానికి భారత్ బయోటెక్‌కు సూత్రప్రాయంగా ఆమోదం  తెలిపింది. సుమారు 900 స‌బ్జెక్ట్స్‌పై ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. 

కాగా, భార‌త్ బ‌యోటెక్ అభివృద్ది చేస్తున్నఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోసుల‌ను ముక్కు ద్వారా అందిస్తారు. ద్ర‌వ రూపంలో ఉండే ఈ క‌రోనా టీకా డోసుల‌ను నాసికా రంధ్రం ద్వారా శ‌రీరంలోకి పంపిస్తారు. ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ టీకాల‌ను భార‌త్ లో తొలిసారి భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేసింది. మూడ‌వ డోసు మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ కోసం అప్లికేష‌న్ ఇచ్చిన సంస్థ‌ల్లో భార‌త్ బ‌యోటెక్ రెండ‌వది. ముక్కు ద్వారా ఇచ్చే టీకాల‌తో అన్ని ర‌కాల కోవిడ్ వేరియంట్ల‌ను నియంత్రించ‌వ‌చ్చున‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్‌లు పొందిన వారికి బూస్టర్ మోతాదును అందించే ప్ర‌క్రియ‌లో ఉన్నామ‌ని భారత్ బయోటెక్ గతంలో పేర్కొంది. రెండు  ఇంట్రానాసల్ బూస్టర్ డోసుల మధ్య దాదాపు ఆరు నెలల ఉంటుంద‌ని స‌ద‌రు సంస్థ తెలిపింది. కాగా, డిసెంబర్ 25న దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే నాసికా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలావుండ‌గా, క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌తో పాటు క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు 1,64,44,73,216 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. అంద‌లో మొద‌టి డోసు తీసుకున్న‌వారు 89.1 కోట్ల మంది ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారు 69.9 కోట్ల మంది ఉన్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 72,21,66,248 క‌రోనా (Coronavirus) ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. గురువారం ఒక్క‌రోజే 14,62,261 క‌రోనా (Coronavirus) మ‌హ‌మ్మారి శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 

కాగా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 2,51,209 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్‌-19 కేసులు 4,06,22,709కి చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,80,24,771 మంది బాధితులు కరోనా వైరస్(Coronavirus) నుంచి కోలుకున్నారు.  గ‌త 24 గంట‌ల్లోనే 3 ల‌క్ష‌ల మందికి పైగా కోలుకోవ‌డం ఊర‌ట క‌లిగించే విష‌యం. కొత్త‌గా  3,47,443 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు అధికం అవుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం  21,05,611 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. అలాగే,  క‌రోనా వైర‌స్ (Coronavirus) తో పోరాడుతూ కొత్తగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో ఇప్పటివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  4,92,327కు పెరిగింది. కరోనా కేసులు తక్కువవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 15.28 శాతానికి తగ్గింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios