వచ్చే నెలలో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ.. సీట్ల పంపకాల ప్రక్రియ షురూ
ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తొలి బహిరంగ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ రోజు ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశమైంది.

న్యూఢిల్లీ: విపక్ష కూటమి ఇండియా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించనుంది. ఇండియా కూటమి సమన్వయ కమిటీ బుధవారం తొలిసారి సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ప్రతిపక్ష కూటమి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ బహిరంగ సభలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ ప్రభుత్వ హయాంలోని అవినీతి అంశాలను లేవనెత్తనున్నారు. ఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.
సీట్ల పంపకం
ఈ సమన్వయ కమిటీలో అనేక అంశాలపై చర్చ జరిపినట్టు తెలిసింది. అందులో 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి సీట్ల పంపకానికి ఫార్ములాపైనా చర్చ చేసింది. గత ఎన్నికల్లో పార్టీల ప్రదర్శన, బలాబలాలు, రాష్ట్రంలో పెద్ద పార్టీ వంటి అంశాల ఆధారంగా సీట్ల పంపకాల ఫార్ములాను తయారు చేయనున్నారు. ఈ ఫార్ములా ఆధారంగా సీట్ల పంపకాల ప్రక్రియ ప్రారంభం కానుంది.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనేది ఈ సీట్ల పంపకాల ఉమ్మడి లక్ష్యంగా ఉండనుంది.
Also Read: సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్పెయిన్ నుంచి స్వీకరించిన భారత వైమానిక దళం
26 ప్రతిపక్ష పార్టీలో ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి సమన్వయ కమిటీ ఉన్నత నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటుంది.
ఈ సమన్వయ కమిటీలో 14 మంది సభ్యులు ఉంటారు. కేసీ వేణుగోపాల్, టీఆర్ బాలు, హేమంత్ సోరెన్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, రాఘవ్ చద్దా, జావెద్ అలీ ఖాన్, లలన్ సింగ్, డీ రాజా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, అభిషేక్ బెనర్జీ, సీపీఎం నుంచి ఓ సభ్యుడు ఉన్నారు.