Independence Day : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మువ్వన్నెల కాంతులతో మెరిసిపోయింది. FIA ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

India Day FIA Event: న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మువ్వన్నెల కాంతులతో జిగేల్ మంది. ఆగస్టు 14న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA NY-NJ-CT-NE) తమ వార్షిక ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లైటింగ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మాన్హాటన్ ల్యాండ్‌మార్క్‌ను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో అద్భుతంగా అలంకరించారు.

ఈ ఏడాది 'హార్మనీ ఇన్ హెరిటేజ్' అనే థీమ్‌తో 44వ వార్షిక 'ఇండియా డే' వేడుకలను నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికాల చారిత్రక ఘట్టాలను ఈ వేడుక కలసికట్టుగా జరుపుకొంది. భారత్ తన 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, అమెరికా కూడా తన 250వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం విశేషం.

సంస్కృతి, సంప్రదాయాల సంగమం

కళాశ్రీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యంతో ఈ కార్యక్రమం చాలా వైభవంగా ప్రారంభమైంది. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌కు బీనా మీనన్ కొరియోగ్రఫీ అందించారు. FIA జాయింట్ సెక్రటరీ సృజల్ పటేల్ ఈ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించారు. వచ్చిన అతిథులకు ఆయన ఘనంగా స్వాగతం పలికారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ సభను ముందుకు నడిపించారు.

ఈ ప్రత్యేక సందర్భంలో FIA ఛైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడారు. "అమెరికా 250 ఏళ్ల వేడుకలు, భారత్ 80 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు ఒకేసారి జరుపుకోవడం రెట్టింపు సంతోషాన్ని ఇస్తోంది. మన కమ్యూనిటీ గర్వకారణమైన ఎడిసన్ మేయర్ శామ్ జోషి ఈ వెలుగుల పండగను ప్రారంభించడం ఎంతో విశేషం" అని ఆయన అన్నారు. FIA ప్రెసిడెంట్ శ్రీకాంత్ అక్కపల్లి కూడా ఈ సభను ఉద్దేశించి మాట్లాడారు.

మెరిసిన ఎడిసన్ మేయర్, సెలబ్రిటీలు

FIA ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎడిసన్ మేయర్ శామ్ జోషి మాట్లాడారు. ట్రై-స్టేట్ ప్రాంతంలో భారతీయ అమెరికన్ల ప్రభావం చాలా గొప్పదని ఆయన కొనియాడారు. హెల్త్‌కేర్, బిజినెస్, టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి రంగాలలో భారతీయ సమాజం అందిస్తున్న సేవలను, కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ వేడుకలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' (TMKOC) టీవీ షో బృందం. నీలా ఫిల్మ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సీరియల్ నటులు దిలీప్ జోషి, మున్మున్ దత్తా, మందార్ చంద్వాడ్కర్, సోనాలికా జోషి, బల్విందర్ సింగ్, నితేష్ భలూనిలతో పాటు శేష్‌ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. టవర్‌ను త్రివర్ణ కాంతుల్లో ముంచెత్తేందుకు సాంప్రదాయ స్విచ్‌ను లాగే అరుదైన గౌరవం శేష్‌కి దక్కింది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అపూర్వ స్పందన

ఈ అద్భుతమైన దృశ్యాన్ని తిలకించడానికి వందలాది మంది సందర్శకులు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. అంతేకాకుండా FIA డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వీక్షకులు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించారు. లైటింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత సందర్శకులు భవనం గ్రాండ్ స్టెయిర్‌కేస్‌పై గ్రూప్ ఫోటోలు దిగారు.

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రతినిధుల నుంచి అతిథులు జ్ఞాపికలను స్వీకరించారు. ఆ తర్వాత భవనంలోని అబ్జర్వేషన్ డెక్స్‌పై వేడుకలు కొనసాగాయి. గౌరవ గ్రహీతలను అభినందిస్తూ మేయర్ జోషి తన ప్రసంగాన్ని ముగించారు. భారతీయ సమాజాన్ని ఐకమత్యంగా ఉంచడంలో నిరంతరం కృషి చేస్తున్న FIA సంస్థకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

View post on Instagram