ఏపీ, బెంగాల్, ఒడిశా, బిహార్‌లో వడగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రానున్న మూడు నాలుగు రోజుల వరకు ఈ ముప్పు ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు ఐఎండీ వార్నింగ్‌లు జారీ చేసింది.
న్యూఢిల్లీ: భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుతున్నాయి. ఫ్యాన్, కూలర్ లేకుండా.. ఇంట్లో ఉండటం అసాధ్యంగా మారింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతోపాటు వడగాలుల ముప్పూ తలెత్తనుంది. తాజాగా, భారత వాతావరణ శాఖ వడగాలుల వార్నింగ్ జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్‌లలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరో మూడు నాలుగు రోజుల వరకు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఏప్రిల్ 17వ తేదీ వరకు బెంగాల్‌లో గంగా నదీ తీర ప్రాంతాల్లో, ఏపీలో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో, ఒడిశా రాష్ట్రంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని వివరించింది. బిహార్‌లో ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు వడగాలుల ముప్పు ఉంటుందని తెలిపింది.
ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సాధారణానికి మించి అధిక ఎండలు ఉంటాయని ఐఎండీ ఇటీవలే వెల్లడించింది. వాయవ్య భారతం, నదీ తీరాలు మినహా దేశమంతటా సాధారణం కంటే ఎక్కువ ఎండలు ఉంటాయని అంచనా వేసింది.
ఈ కాలంలో సాధారణానికి మించి వడగాలులు వీచే రోజులు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ పేర్కొంది. దేశంలో ముఖ్యంగా మధ్య, ఉత్తరాదిలో ఎండలు ప్రస్తుతం 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మేరకు రిపోర్ట్ అవుతు న్నదని తెలిపింది.
