ఉత్తరప్రదేశ్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ హతమయ్యాడు. ఈ రోజు ప్రయాగ్ రాజ్ కోర్టులో విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్లుతున్నప్పుడు ఈ విషయం తెలుసుకుని అతీక్ అహ్మద్ కన్నీరుమున్నీరయ్యాడు. తన కొడుకు చావుకు తానే కారణం అని ఆవేదనకు లోనయ్యాడు. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ గురువారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కొన్ని నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిన అసద్ సమాచారం తెలుసుకుని వారిని పట్టుకోవడానికి వెళ్లిన తరుణంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో అసద్ మరణించాడు. ఈ వార్త విన్న అసద్ తండ్రి, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుప్పకూలాడు. తన బిడ్డ చావుకు తానే కారణం అని నిందించుకున్నాడు. కన్నీరుమున్నీరయ్యాడు.

ఉమేష్ పాల్ హత్య కేసులో విచారణ కోసం అతీక్ అహ్మద్‌ను నేడు ప్రయాగ్‌రాజ్ కోర్టులో హాజరుపరిచారు. ఇదే సందర్భంలో అతీక్ అహ్మద్ కొడుకు అసద్ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అతీక్ అహ్మద్ కన్నీరు పెట్టుకున్నాడు. కోర్టులోనే కుప్పకూలిపోయాడు. విచారణ తర్వాత జైలుకు తీసుకెళ్లుతుండగా ఆయన దుఖించాడు. ‘నా బిడ్డ చావుకు నేనే కారణం’ అని ఏడ్చేశాడు. తన బిడ్డ అంత్యక్రియల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశాడు.

2005 నాటి ఉమేష్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ కొడుకు అసద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ మర్డర్ తర్వాత అతీక్ కొడుకు అసద్, అతీక్ అనుచరుడు గులాంలు కనిపించకుండా పోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. తాజాగా, వీరు ఝాన్సీలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వారిని అరెస్టు చేయడానికి పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులకు, నిందితులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో అసద్, గులాంలు ఇద్దరూ చనిపోయారు. 

సీఎంకు ఉమేష్ పాల్ కుటుంబం కృతజ్ఞతలు

Also Read: Asad Ahmed Encounter: రెండు నెలల్లో 6 నగరాలు.. 10 సిమ్ కార్డులు.. చివరికి మధ్యప్రదేశ్ లో హతం..

ఒక వైపు అతీక్ అహ్మద్ తన కొడుకు మరణించాడని ఏడుస్తుండగా.. ఉమేష్ పాల్ కుటుంబం మాత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి న్యాయం చేశారని పేర్కొన్నారు. ఇకపైనా ఇలాగే న్యాయం అందాలని కోరారు. సీఎం యోగిపై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని, ఇది మరణించిన తమ కుమారుడికి అందిన నివాళిగా భావిస్తామని ఉమేష్ పాల్ తల్లి శాంతి దేవీ పేర్కొన్నారు. ఉమేష్ పాల్ భార్య జయాదేవీ కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.