చైనా, పాకిస్థాన్‌ల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత వాయుసేన కీలక నిర్ణయం తీసుకుంది. తన మిగ్-29 UPG ఫైటర్ జెట్లకు పాత R-73 క్షిపణుల స్థానంలో అత్యాధునిక ASRAAM మిస్సైళ్లను అమర్చనుంది. దీంతో గగనతలంలో భారత శక్తి మరింత పెరగనుంది.

న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన LCA తేజస్, బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్లపై అడ్వాన్స్‌డ్ ASRAAM క్షిపణిని విజయవంతంగా అమర్చిన భారత వాయుసేన (IAF) ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్-29 UPG విమానాలకు కూడా ఈ యూరోపియన్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌ను అమర్చాలని ప్లాన్ చేస్తోంది.

యూరోపియన్ రక్షణ రంగ దిగ్గజం MBDA అభివృద్ధి చేసిన ఈ అడ్వాన్స్‌డ్ షార్ట్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ (ASRAAM), ప్రధానంగా కంటికి కనిపించేంత దూరంలో (విజువల్ రేంజ్) ఉన్న శత్రు విమానాలను నాశనం చేయగలదు. దీని దాడి పరిధి 25 కిలోమీటర్లకు పైనే ఉంటుంది.

ఈ నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ మార్చి 25న ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేసింది. మిగ్-29 UPG విమానాలకు ASRAAM క్షిపణులను అమర్చడం, సర్టిఫికేషన్ పొందడం దీని ఉద్దేశం. ఈ ప్రపోజల్‌లో లాంచర్లు, టూల్స్, టెస్టింగ్ సిస్టమ్స్, పైలట్లకు శిక్షణ వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద 8 ట్రైనర్ వేరియంట్లతో కలిపి 55కు పైగా మిగ్-29 విమానాలున్నాయి. 

ఈ కొత్త క్షిపణుల రాకతో 1980ల నాటి పాత తరం R-73 మిస్సైళ్ల స్థానంలో నాలుగో తరం అత్యాధునిక క్షిపణులు వస్తాయి. R-73 క్షిపణి పరిధి కేవలం 10 నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే. IAF ఇప్పటికే చాలా ఫైటర్ జెట్లలో R-73 స్థానంలో ASRAAM క్షిపణులనే తర్వాతి తరం క్లోజ్-కంబాట్ మిస్సైల్‌గా ఎంపిక చేసింది.

ఆగస్టు 2021లో MBDA, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, BDL హైదరాబాద్ కాంప్లెక్స్‌లో ఫైనల్ అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్ట్ (FAIT) కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే ఈ క్షిపణుల మరమ్మతులు, నిర్వహణ కూడా చూసుకుంటారు.

ASRAAM ప్రత్యేకతలు ఏంటి?

ASRAAM అనేది గగనతలంలో దగ్గరి పోరాటాలు, డాగ్‌ఫైట్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్షిపణి. ఇది వేడిని అనుసరించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది (హీట్-సీకింగ్). అత్యంత వేగంగా కదలగలగడం, 'ఫైర్ అండ్ ఫర్గెట్' (ప్రయోగించాక దాని పని అది చేసుకుపోతుంది) దీని ప్రత్యేకత.

ఈ క్షిపణి ధ్వని కన్నా మూడు రెట్ల వేగంతో (Mach 3) ప్రయాణిస్తుంది. 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. గాల్లో వేగంగా మలుపులు తిరుగుతూ 50g వరకు తట్టుకోగలదు.

ASRAAM క్షిపణిని 1998లో రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF) తొలిసారిగా సేవల్లోకి తీసుకుంది. దీని 'ఫైర్ అండ్ ఫర్గెట్' సామర్థ్యం వల్ల, ప్రయోగించిన తర్వాత పైలట్ నుంచి ఎలాంటి తదుపరి సహాయం అవసరం లేకుండానే అది స్వయంగా లక్ష్యాన్ని చేరుకుంటుంది. వేగంగా దూసుకొచ్చే శత్రు విమానాలతో పోరాటానికి ఇది చాలా అనువైనది.

ఈ క్షిపణి పొడవు 2.9 మీటర్లు, వ్యాసం 166 మిమీ, బరువు సుమారు 88 కిలోలు. ఇందులో హై-ఎక్స్‌ప్లోజివ్ బ్లాస్ట్ ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్ ఉంటుంది.

చైనా PL-10, పాకిస్థాన్ PL-10Eతో పోలిస్తే ఎలా ఉంది..?

ఇండియా శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్ కూడా ఇలాంటి విజువల్ రేంజ్ క్షిపణులను వాడుతున్నాయి. చైనా PL-10, దాని ఎగుమతి వేరియంట్ అయిన PL-10Eని పాకిస్థాన్ ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ASRAAMను మిగ్-29లకు అమర్చడం IAFకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం.

చైనా తన PL-10 క్షిపణిని 2015లో సేవల్లోకి తెచ్చింది. దీని అభివృద్ధి 2004లో మొదలైంది. J-10C, J-16, ఐదో తరం J-20 వంటి ఫైటర్ జెట్ల కోసం దీన్ని తయారు చేశారు. ఈ PL-10 గరిష్ట పరిధి సుమారు 20 కిలోమీటర్లు అని చెబుతున్నా, కొన్నిసార్లు 30 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని అంచనా. గరిష్ఠ వేగం విషయంలో ఇది ASRAAM కన్నా కొంచెం ముందుంది. కానీ, ASRAAMలో పెద్ద రాకెట్ మోటార్ (166 మిమీ) ఉండటం వల్ల, అది ఎక్కువ సేపు వేగాన్ని నిలుపుకోగలదు, ఎక్కువ దూరం ప్రయాణించగలదు.

చైనాతో రక్షణ భాగస్వామ్యంలో భాగంగా పాకిస్థాన్ 2021 నుంచి తన JF-17 బ్లాక్ III ఫైటర్ జెట్లపై PL-10E క్షిపణులను అమర్చుకుంటోంది.