కర్ణాటకలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. కాంగ్రెస్ పార్టీ 70 కంటే ఎక్కువ సీట్లు గెలవదని జ్యోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. 

వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 130 నుంచి 140 సీట్లు గెలుచుకుంటుందని మూడు సర్వేలు చెబుతున్నాయని బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప అన్నారు. తాను 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రజల నాడి తనకు తెలుసని అన్నారు. గురువారం బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక ఎంపీలందరి సహకారంతో, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో తాము తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మోడీపై జైరాం రమేష్ విమర్శలు: ఎదురు దాడి చేసిన నెటిజన్లు

లింగాయత్ వర్గంలో బలమైన నేతగా ఉన్న యడ్యూరప్ప వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని పునరుద్ఘాటించారు. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ఆయన తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడానని చెప్పారు. తమ ఎంపీలంతా ఆయా జిల్లాల్లోనే ఉంటారని చెప్పారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ఎవరూ పార్టీని వీడబోరని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల విషయంలో పార్టీ వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయి.. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది - జనసేన అధినేత పవన్ కల్యాణ్

రిజర్వేషన్ల అంశంపై యడియూరప్ప మాట్లాడుతూ ముస్లింలకు ప్రభుత్వం ఎలాంటి అన్యాయమూ చేయలేదని అన్నారు. ఆ వర్గాన్ని ఎవరూ తప్పుదోవ పట్టించకూడదని, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పారు. రిజర్వేషన్లపై బంజారాలు చేస్తున్న నిరసనపై ఆయన మాట్లాడుతూ.. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ‘‘ కొన్ని అపార్థాలు ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకట్రెండు చోట్ల మాత్రమే ఇలాంటి ఘటనలు జరిగాయి’’ అని అన్నారు. 

వ‌చ్చేవారం చెన్నైలో ప్ర‌తిప‌క్షాల భేటీ.. మెగా స‌మావేశానికి పిలుపునిచ్చిన స్టాలిన్

టికెట్ల పంపకంపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని యడ్యూరప్ప చెప్పారు. తమ రిపోర్టుల ఆధారంగా గెలిచే అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తామని... టిక్కెట్లు ఇవ్వని వారు పార్టీ కోసం పనిచేస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి ఏమాత్రం సరితూగరని ఆయన కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో కొందరు (కాంగ్రెస్ నేతలు) సీఎం కావాలని పగటి కలలు కంటున్నారని, కానీ అలా జరగబోదని అన్నారు. ఆ పార్టీ 70 సీట్లకు మించి గెలవదని ఆయన జ్యోస్యం చెప్పారు. 

ఆరు నెలల్లోనే అత్యధికం.. వ‌రుస‌గా రెండో రోజు 3 వేలకు పైగా కోవిడ్ కొత్త కేసులు

కాగా.. కేంద్ర ఎన్నికల కమిషన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం గత బుధవారం షెడ్యూల్ ను ప్రకటించింది. మొత్తం 224 స్థానాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించనుంది. మే 10న పోలింగ్ ఉండగా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది. ఏప్రిల్ 13 గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 20వ తేదీ నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ కాగా.. ఏప్రిల్ 21 వరకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.