Chennai: వచ్చే వారం చెన్నైలో మెగా ప్రతిపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరుకానున్నారు.
Tamil Nadu chief minister MK Stalin: ఏప్రిల్ 3న 'సామాజిక న్యాయం, ముందున్న మార్గం' అనే అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తలపెట్టిన విపక్షాల సమావేశంలో కనీసం 14 ప్రతిపక్ష పార్టీలు పాల్గొంటాయని సమాచారం. బిజూ జనతాదళ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సైతం ఈ సమావేశంలో పాల్గొంటాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈడీ, సీబీఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలను ఏకపక్షంగా ఉపయోగించడాన్ని నిరసిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు కలిసి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏప్రిల్ 3న జరిగే ఈ సమావేశం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న తొలి సమావేశం కావడం గమనార్హం. దీంతో ఈ సమావేశానికిని ప్రాధాన్యత సంతరించుకుంది.
"ప్రతిపక్షాల ఐక్యత అనేది ఒక దశలో ఒక అడుగు అవసరమయ్యే ప్రక్రియ. ముఖ్యమైన అంశాలపై ఒక పెద్ద ఉమ్మడి వేదికను సృష్టించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని" తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. చెన్నైలో జరిగి ప్రతిపక్షాల సమావేశానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నేత కే కేశవరావు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డీ.రాజా, ఓబ్రెయిన్, ఎన్సీపీ నేత చగన్ భుజ్బల్ లు హాజరుకానున్నారు. స్టాలిన్ అరగంట పాటు మాట్లాడనున్నారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించడానికి సరైన సమయం లభించేలా చూడాలని నిర్ణయించినట్లు మరో నేత తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ, ఐయూఎంఎల్, ఎండీఎంకే కూడా ప్రతి రాజకీయ పార్టీకి ముఖ్యమైన ఈ అంశంపై సమావేశానికి హాజరు కానున్నాయి. తమ రాజ్యసభ నేత సంజయ్ సింగ్ చెన్నైలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని ఆప్ సూచించిందని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. శివసేన ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వనప్పటికీ.. ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ పార్టీ, వైసీపీ ఈ కార్యక్రమంలో చేరితే, అది విస్తృత ప్రభావాన్ని సృష్టిస్తుందని ప్రతిపక్ష నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ కాంగ్రెస్ వంటి అనేక ప్రతిపక్ష పార్టీలకు దూరంగా ఉంటున్నాయి. పట్నాయక్ కు చెందిన బీజేడీని ప్రతిపక్ష కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేందుకు పశ్చిమబెంగాల్ సీఎం చొరవ తీసుకున్నారని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రణాళికలో పాల్గొన్న కొందరు రాజకీయ నాయకులు పేర్కొన్నారు.
నాయకత్వ పాత్ర ఒకరిద్దరు హక్కుదారులకు మాత్రమే పరిమితం కాదనీ, ప్రతిపక్ష క్లబ్ లోని ప్రతి భాగానికి ముఖ్యమైన పాత్ర ఉందని సందేశాన్ని పంపడానికి కూడా ఈ కార్యక్రమం ప్రయత్నిస్తుంది. ఇది మునుపటి థర్డ్ ఫ్రంట్ నిర్మాణాలలో తరచుగా కనిపించని లక్షణంగా చెప్పవచ్చు. "ఇగోలకు ఆస్కారం లేదు. పలు అంశాలపై వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే వరుస కార్యక్రమాలకు ఇది ఆరంభం. ఒక రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షానికి ఇతర పార్టీల మద్దతు లభించాలని చెన్నై సమావేశం సంకేతాలు ఇస్తోంది, ఇది మమతా బెనర్జీ లేదా కే.చంద్రశేఖర రావు వంటి నాయకుల సిద్ధాంతం" అని పైన ఉదహరించిన అధికారి ఒకరు చెప్పారు.
