Asianet News TeluguAsianet News Telugu

ఔను.. దర్శన్ హీరానందానికి లాగిన్ ఐడీ ఇచ్చాను! కానీ, లంచం కోసం కాదు: మహువా మోయిత్రా

అదానీపై ప్రశ్నలు వేస్తూ మోడీని ఇబ్బంది పెట్టేలా మహువా మోయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి బిజినెస్ మ్యాన్ దర్శన్ హీరానందాని నుంచి లంచం తీసుకుందనే సంచలన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారిస్తున్నది. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలను ఖండించారు. దర్శన్‌కు లోక్ సభ లాగిన్ ఐడీ క్రెడెన్షియల్ ఇచ్చారని అంగీకరించిన మోయిత్రా అయితే.. లంచం కోసం ఆ వివరాలు పంచుకోలేదని స్పష్టం చేశారు.
 

I have gave lok sabha login credentials to darshan hiranandani, but not for bribe clarifies mahua moitra kms
Author
First Published Oct 28, 2023, 6:48 PM IST

న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాపారవేత్త, హీరానందాని గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందానికి తాను తన లోక్ సభ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చినట్టు అంగీకరించారు. అయితే.. వాటిని లంచం కోసం ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను హీరానందానిని నుంచి కేవలం ఒక స్కార్ఫ్, కొన్ని లిప్‌స్టిక్‌లు, ఐ షాడో వంటి మేకప్ వస్తువులను బహుమతులుగా పొందాను అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకానీ, తాను లంచం తీసుకున్నారనే ఆరోపణలను ఖండించారు. హీరానందానిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి తనకు ఒక అవకాశం ఇవ్వాలనీ డిమాండ్ చేశారు.

పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి, ముఖ్యంగా అదానీ కంపెనీ పై ప్రశ్నలు వేస్తూ ప్రధాని మోడీని ఇరుకునపెట్టేలా ప్రశ్నలు వేయడానికి మహువా మోయిత్రా బిజినెస్‌మెన్ హీరానందాని నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ, మహువా మోయిత్రాతో గతంలో తీవ్ర వాగ్వాదం పెట్టుకున్న నిషికాంత్ దూబే, మహువా మోయిత్రా మాజీ బాయ్ ఫ్రెండ్, ఢిల్లీకి చెందిన లాయర్ జై అనంత్ దేహద్‌రాయ్‌లు ఈ ఆరోపణలను చేశారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ఈ ఆరోపణలను విచారిస్తున్నది. ఇది వరకే నిషికాంత్ దూబే, జై అనంత్ దేహద్‌రాయ్‌లు ఎథిక్స్ కమిటీ ముందు హాజరై తమ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈ నెల 31వ తేదీన మహువా మోయిత్రాను కూడా హాజరు కావాలని సమన్లు పంపగా ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని మోయిత్రా సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా దేహద్ రాయ్ పైనా మోయిత్రా విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా ఆయనకు వస్తున్న గుర్తింపునకు ఆయన అర్హుడు కాదని అన్నారు. పెంపుడు కుక్క హెన్రీ కోసం ఇద్దరి మధ్య జరిగిందని, ఈ నేపథ్యమే ప్రేరేపితంగా తనపై ఆయన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Also Read: బీసీని సీఎం చేస్తామన్న అమిత్ షా ప్రకటనపై బీసీ లీడర్ బండి సంజయ్ కామెంట్ ఇదే

హీరానందానితో తన లోక్ సభ లాగిన్ డీటెయిల్స్ పంచుకున్నానని చెప్పిన మోయిత్రా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇతరులతోనూ ఆమె తన క్రెడెన్షియల్స్ పంచుకున్నారని వివరించారు. తన నియోజకవర్గం మారుమూలలో ఉన్నందున ఇది తప్పలేదని ఆమె తెలిపారు. అయితే.. ఎప్పుడైనా దానికి ఒక ఓటీపీ ఉంటుందని,  తన ప్రశ్నలను తన టీమ్ పోస్టు చేస్తుందని వివరించారు. లాగిన్ క్రెడెన్షియల్స్ ఇతరులతో పంచుకోరాదని పార్లమెంటరీ వెబ్ సైట్ నడిపే ఎన్ఐసీ ఎలాంటి నిబంధనా పెట్టలేదని తెలిపారు.

హీరానందానిని తన క్లోజ్ ఫ్రెండ్ అని పేర్కొన్న మహువా మోయిత్రా.. ఆయన నుంచి తాను బర్త్ డే గిఫ్ట్‌‌గా స్కార్ఫ్, లిప్‌స్టిక్స్, బాబీ బ్రౌన్‌ కంపెనీ మేకప్ వస్తువులు పొందానని వివరించారు. పన్నులు వేయని ఓ దుబాయ్ షాపులో నుంచి వాటిని తీసుకొచ్చారని తెలిపారు. తన ప్రభుత్వ బంగ్లాలో ఇంటీరియర్ రీడిజైన్ కోసం దర్శన్ హీరానందానీ సహాయం తీసుకున్నారని, కానీ, ఆ రిపేర్ మాత్రం ప్రభుత్వశాఖతోనే చేయించుకున్నానని వివరించారు.

‘నాకు ప్రభుత్వం బంగ్లా కేటాయించినప్పుడు అది దెబ్బతిని ఉన్నది. ఇంటిలోకి వెలుతురు వచ్చేలా డోర్లను మార్చేసేలా రీడిజైన్ చేయడానికి ఆయన ఆర్కిటెక్ట్ ఒకరిని పంపించరా అని అడిగాను’ అని మోయిత్రా తెలిపారు. వారు పంపిన కిచెన్, రూముల, లేఔట్లు, డిజైన్లను చూపిస్తూ.. వాటిని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించానని చెప్పారు. ఆ రిపేర్ ప్రభుత్వ శాఖనే చేసిందని వివరించారు. తాను ఎప్పుడు ముంబయికి వచ్చినా ఫ్రెండ్ హీరానందాని కారు వాడుకునే దాన్ని అని తెలిపారు. రూ. 2 కోట్ల లంచం అనే ఆరోపణను తీవ్రంగా ఖండించారు.

Also Read: సిర్పూర్‌లో బీఆర్ఎస్‌తో బీఎస్పీ ఢీ.. కోనేరు కోనప్పపై ఆర్ఎస్పీ పోటీ.. బరిలో కోనప్ప మేనల్లుడు!.. టాప్ పాయింట్స్

‘ఇంతకు మించి దర్శన్ హీరానందానికి నాకేమైనా ఇచ్చాడేమో వెంటనే వెల్లడించాలని కోరుతున్నాను. ఆరోపణలు ఎవరైనా చేయవచ్చు. వాటిని నిరూపించే బాధ్యత కూడా వారి మీదే ఉంటుంది. నాకు ఇచ్చిన అఫిడవిట్‌లో రూ. 2 కోట్లు ఇచ్చిన మాట లేదు. ఒక వేళ డబ్బే ఇచ్చినట్టైతే అందుకు సంబంధించిన తేదీ,ఇతర డాక్యుమెంటరీ ఆధారాలను దయచేసి నాకు అందించండి’ అంటూ మహువా మోయిత్రా లంచం ఆరోపణలను ఖండించారు.

Follow Us:
Download App:
  • android
  • ios