Asianet News TeluguAsianet News Telugu

సిర్పూర్‌లో బీఆర్ఎస్‌తో బీఎస్పీ ఢీ.. కోనేరు కోనప్పపై ఆర్ఎస్పీ పోటీ.. బరిలో కోనప్ప మేనల్లుడు!.. టాప్ పాయింట్స్

సిర్పూర్ టీ నియోజకవర్గంలో ఈ సారి పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, బీఎస్పీ మధ్యే ఉండబోతున్నట్టు తెలుస్తున్నది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి మూడోసారి కోసం పోటీ పడుతున్న కోనేరు కోనప్ప తనను ఆపేవారు లేరంటూ ధీమాగా ఉన్నారు. కాగా, సోషల్ యాక్టివిస్ట్‌గా, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీలో మంచి పేరు సంపాదించుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. ఇక్కడ బీఎస్పీకి ఉన్న బలం, ప్రజా వ్యతిరేకత తనకు అనుకూలిస్తుందని భావిస్తున్నట్టు సమాచారం.
 

BRS vs BSP in sirpur seat, RSP to fight sitting mla koneru konappa kms
Author
First Published Oct 28, 2023, 3:32 PM IST | Last Updated Oct 28, 2023, 3:32 PM IST

హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీఎస్‌పీకి మధ్య రసవత్తర పోరు జరగబోతున్నది. బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప బరిలోకి దిగి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ కొట్టడానికి ఆశపడుతున్నారు. ఇది వరకు బీఎస్పీ ఇక్కడ గెలిచిన చరిత్ర ఉన్నది. పార్టీ బలాన్ని బేరీజు వేసుకుని ఎంచుకున్న ఈ నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు. గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా తన మకాం ఇప్పుడు సిర్పూర్‌కు మార్చుకుని నాన్ లోకల్ అనే ట్యాగ్‌ను కౌంటర్ చేశారు. కాగా, కోనప్ప ఈ ఎన్నికల్లో తన మేనల్లుడు రావి శ్రీనివాస్‌ను ఎదుర్కోవాల్సి ఉన్నది. కాంగ్రెస్ టికెట్ పై ఇక్కడి నుంచి కోనప్పపై రావి శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. వీరితోపాటు రాజకీయాల్లో పేరున్న పాల్వాయి కుటుంబం నుంచి హరీష్ బాబు బీజేపీ టికెట్ పై బరిలోకి దిగుతున్నారు.

కోనప్ప ప్లస్ అండ్ మైనస్

2014లో బీఎస్పీ టికెట్ పై గెలిచిన కోనేరు కోనప్ప ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 2018లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించారు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాగజ్ నగర్ పేపర్ మిల్లు మూతపడింది. ఈయనే దాన్ని తిరిగి తెరిపించారు కూడా. మహారాష్ట్ర, తెలంగాణల మధ్య  గూడెం వంతెన నిర్మించడంతో రాకపోకలు మెరుగయ్యాయి. వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించడానికి నిధుల కోసం కృషి చేశారు. ఇవన్నీ ఆయన తన ప్రచారాస్త్రాలుగా మార్చుకోబోతున్నారు.

పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కోనప్పపై సహజంగానే కొంత వ్యతిరేకత నెలకొంది. దీనికి తోడు ఆయన హయాంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని, ఇప్పటికీ మారుమూల ప్రాంతాలలో రోడ్లు సరిగా లేవని, చుట్టూ పెన్ గంగ, ప్రాణహిత, పెద్దవాగు వంటి నదులు ఉన్నప్పటికీ సాగుకు నీరు లేకుండా పోయిందని, మంచినీరు కష్టమైపోయిందనే విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి.

Also Read: కాంగ్రెస్ ప్రకటించని ఆ 19 స్థానాల మతలబేంటీ?

ఆర్ఎస్పీ అడుగు

గత ఎన్నికల్లో బీఎస్పీకి పడిన ఓట్లు ఆశాజనకంగా ఉన్నాయి. సిర్పూర్ జనరల్ కేటగిరీ సీటు. కానీ, ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ పోటీ పడుతున్నారు. ఆయనకు ఎస్సీ కమ్యూనిటీలో మంచి పేరు ఉన్నది. స్వేరో సహకారంతోపాటు బౌద్ధులు, ఎస్టీలు కూడా ఆయనకు మద్దతు ఇస్తారనే నమ్మకం ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని, అందుకు అనుగుణంగా ప్రచారాన్ని మలుచుకుంటున్నారు.

పాల్వాయి హరీశ్ బాబు

పాల్వాయి కాంగ్రెస్ కుటుంబమే. గత ఎన్నికల్లోనూ పాల్వాయి హరీశ్ బాబు కాంగ్రెస్ టికెట్ పైనే పోటీపడ్డారు. కానీ, ఈ సారి బీజేపీ టికెట్ పై బరిలోకి దిగారు. కుటుంబానికి ఉన్న పలుకుబడితోపాటు హిందూ ఓటు బ్యాంక్ తనకు కలిసి వస్తుందనే భావిస్తున్నారు.

రావి శ్రీనివాస్

మేనమామ అయిన కోనేరు కోనప్పపై రావి శ్రీనివాస్ దూకుడుగా విరుచుకుపడుతున్నారు. స్వల్ప కాలంలోనే నియోజకవర్గంలో పేరు సంపాదించుకున్నారు. కోనేప్పపై అభివృద్ధి సంబంధ ప్రశ్నలతో దాడి చేస్తున్నారు. తద్వార ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ టికెట్ పై బరిలోకి దిగడంతో.. పార్టీకి ఉన్న సాంప్రదాయిక ఓట్లు వస్తాయని భావిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios