నిక్కీయాదవ్ తో ఉండాలా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా తేల్చుకోలేకే.. ఆ కన్ ఫ్యూజన్ లో ఆమెను హత్య చేసినట్లుగా సాహిల్ చెబుతున్నాడు.
న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన నిక్కీయాదవ్ హత్య కేసులో సాహిల్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సాహిల్ గెహ్లాట్.. ఆ వేడుకలో తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశాడు. ఆ తరువాత తన లివ్ ఇన్ పార్ట్‌నర్ నిక్కీ యాదవ్ తో కారులో వెడుతుండగా.. తీవ్ర వాగ్వివాదం జరిగిన నేపథ్యంలో.. ఆమెను గొంతు నులిమి చంపేసి.. ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆ తరువాతి రోజు గెహ్లాట్, తాను ఎంగేజ్ మెంట్ చేసుకున్న మహిళను వివాహం చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
నిక్కీ యాదవ్ ను హత్య చేసిన తరువాత ఆమె మృతదేహాన్ని నైరుతి ఢిల్లీలోని తన ధాబాలోని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాడు. ఫిబ్రవరి 14న గెహ్లాట్‌ను విచారించిన తర్వాత రిఫ్రిజిరేటర్‌లో 23 ఏళ్ల నిక్కీ యాదవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రమే నేరం వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు.. ఎంగేజ్‌మెంట్ పార్టీ ముగిసిన తర్వాత గెహ్లాట్ ఉత్తమ్ నగర్‌లోని యాదవ్ అద్దె ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
అక్కడ ఉన్న సమయంలోనే, నిక్కీ యాదవ్ కు ఫిబ్రవరి 10న తన వివాహాం అని చెప్పాడని.. చిన్న ట్రిప్‌కు వెళ్దామని గెహ్లాట్ ఆమెను ఒప్పించగలిగాడని వారు తెలిపారు. రెండవ రోజు విచారణ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ, తాను కావాలని హత్య చేయలేదని.. తను "డబుల్ మైండ్"లో ఉన్నానని, ఏదీ నిర్ణయించుకోలేకపోయానని అన్నట్లు తెలిసింది. తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌తో ఉండాలనుకుంటున్నాడా? లేదా తన తల్లిదండ్రులు చూసిన మహిళను వివాహం చేసుకోవాలా అనే దానిపై నిర్ణయం తీసుకోలేకపోయానని గెహ్లాట్ పోలీసులకు తెలిపాడు.
సంఘటన జరిగిన విషయాన్ని అతను ఇలా వివరించాడు.. నిందితుడు సంఘటనకు 15 రోజుల ముందే సహజీవనంలో ఉన్న నిక్కీ యాదవ్ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అయితే నిశ్చితార్థం అయిన ఫిబ్రవరి 9 న, ఉత్తమ్ నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ రాత్రి ఆమెతో గడిపాడని అతను చెప్పాడు. "నిక్కీ యాదవ్ తనతో పాటు గోవా వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. అప్పటికే ఆమె టిక్కెట్లను బుక్ చేసుకుంది. కానీ ఆమె ట్రావెల్ అప్లికేషన్ ద్వారా గెహ్లాట్ టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అతని టికెట్ బుక్ కాలేదు. కాబట్టి వారు ప్లాన్ మార్చారు. హిమాచల్ ప్రదేశ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
నిక్కీ యాదవ్ హత్య కేసు : ప్రియురాలిని చంపి, పక్కసీటులో శవంతో 40 కి.మీ.లు ప్రయాణించిన సాహిల్...
"వారు అతని కారులో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు, అక్కడ వారు ఆనంద్ విహార్ బస్ టెర్మినస్ నుండి బస్సు ఎక్కవలసి ఉంటుందని తెలుసుకున్నారు, కానీ అక్కడికి చేరుకోగానే, బస్సు కశ్మీర్ గేట్ ఐఎస్ బిటి నుండి బయలుదేరుతుందని వారికి సమాచారం అందింది" అని అధికారి తెలిపారు. కశ్మీర్ గేట్ వద్దకు చేరుకున్న తర్వాత, నిందితుడు తన కారును పార్క్ చేసాడు. వారిద్దరూ తన షెడ్యూల్ పెళ్లి గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు.
విచారణ సందర్భంగా, అతను తెలిపిన వివరాలు చెబుతూ... సాహిల్ నిశ్చితార్థం, పెళ్లి గురించి తెలిసిన నిక్కీ.. సాహిల్ మీద అసంతృప్తితో ఉంది. తనను కాదని మరో మహిళతో పెళ్లికి సిద్ధపడడం ఆమెకు నచ్చలేదని గెహ్లాట్ పోలీసులకు చెప్పాడు. తనతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లాల్సిందిగా ఆమె అతడిని కోరింది. అయితే, ఆ సమయంలో గెహ్లాట్ తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? లేక నిక్కీతో ఉండాలా? అనేది నిశ్చయించుకోలేని ఆలోచనలో ఉన్నాడు.
"అతని వివాహ ప్రణాళిక ఆమెకు కోపం తెప్పించింది. ఆమె తన అసంతృప్తిని ప్రదర్శించింది. కోపంతో గెహ్లాట్ ఆమెను గొంతు కోసి, ఆమె మృతదేహాన్ని గ్రామంలోని తన దాభాకు తీసుకువెళ్ళాడు" అని అధికారి తెలిపారు. అతను తన లైవ్-ఇన్-పార్ట్‌నర్‌ను వదిలించుకోవాలని భావించాడని, వారు విహారయాత్రకు వెళతామని ఆమెకు హామీ ఇవ్వడం ద్వారా ఆమెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
"డబుల్ మైండ్‌లో ఉన్నాడని అతను చెప్పాడు. ఇవన్నీ అతని వెర్షన్, ఎందుకంటే స్థానికంగా విచారించిన తరువాత... అతను తన ఎంగేజ్‌మెంట్ సమయంలో డ్యాన్స్ చేయడం, సరదాగా గడిపడం మాకు తెలిసింది. కాబట్టి, సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో అతడిని దోషిగా నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షతో పాటు సాక్ష్యాలు ఈ కేసును బలమైన కేసుగా మార్చాయి. అతను ఆమెను ఎప్పుడు చంపాడో ఖచ్చితమైన సమయాన్ని అతను ఇంకా చెప్పలేదు”అని అధికారి తెలిపారు. హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత మంగళవారం ఉదయం ధాబాలో రిఫ్రిజిరేటర్ నుంచి యాదవ్ మృతదేహాన్ని వెలికితీశారు.
