కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా ఆమె కూతురు బన్సూరి స్వరాజ్ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా ఆమె కూతురు బన్సూరి స్వరాజ్ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తల్లిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిని ఎంతో మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. దానిని వ్యక్తీకరించడానికి పదాలు కూడా సరిపోవని అన్నారు. అలాగే గతంలో తన జన్మదినం సందర్భంగా సుష్మా స్వరాజ్ కేక్ కట్ చేసిన చిత్రాన్ని కూడా బన్సూరి స్వరాజ్ షేర్ చేశారు.
‘‘అమ్మ.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను నిన్ను ఎంతగా కోల్పోతున్నానో వ్యక్తీకరించడానికి పదాలు సరిపోవు. భాష పరిమితంగా ఉంటుంది. మీ ఆప్యాయత, ఆశీర్వాదాలు, సంస్కృతి, విద్య ఎల్లప్పుడూ నాకు మార్గం సుగమం చేస్తాయనే భరోసా ఉంది. హ్యాపీ బర్త్ డే మా’’ అని బన్సూరి స్వరాజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇక, దివంగత సుష్మా స్వరాజ్ నిజమైన ప్రజానాయకురాలిగా గుర్తుండి పోయారు. ఆమె విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ సమస్యలపై విస్తృత అవగాహనను ప్రదర్శించారు. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు సహాయం చేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలకు ప్రశంసలు అందుకున్నారు. ఇక, సుష్మా స్వరాజ్ విషయానికి వస్తే.. సుష్మ స్వరాజ్ తన 25 ఏళ్ల వయసులోనే 1977లో హర్యానా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుని దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన కేబినెట్ మంత్రిగా నలిచారు. ఆమె 1977-82, 1987-90లో రెండు పర్యాయాలు శాసనసభకు పనిచేశారు.
1984లో సుష్మా స్వరాజ్ బీజేపీలో చేరారు. దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడంలో తన వంతు కీలక పాత్ర పోషించారు. 1996లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో (ఆ ప్రభుత్వం 13 రోజుల పాటు కొనసాగింది) ఆమె సమాచార, ప్రసార శాఖ మంత్రిగా నియమితులయ్యారు. స్వరాజ్ 1998లో ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రెండు నెలల కంటే తక్కువ సమయం ఆమె ఆ పదవిలో కొనసాగారు. 2003 జనవరి నుంచి 2004 మే వరకు సుష్మ సర్వాజ్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా.. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. సుష్మా స్వరాజ్ తన హయాంలో ఆరు ఎయిమ్స్‌ను ప్రారంభించి అరుదైన ఘనత సాధించారు.
2009లో తొలి మహిళా ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ మరోసారి చరిత్ర సృష్టించారు. ఇక, సుష్మ స్వరాజ్.. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండవ మహిళగా నిలిచారు. సుష్మా స్వరాజ్ 67 సంవత్సరాల వయస్సులో 2019 ఆగష్టు 6న రాత్రి ప్రాణాంతకమైన గుండెపోటుతో మరణించారు.
