మంచి పరిపాలన ప్రజల జీవితాలను మారుస్తుంది. లంచాలు, సిఫారసులు లేకుండా పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించడమే అసలైన సుపరిపాలన.ప్రస్తుతం JAM (జన్ ధన్, ఆధార్, మొబైల్) వంటి విధానాల వల్ల దేశంలో పేదరికం తగ్గి, దళారుల వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
రచయిత : రాజీవ్ చంద్రశేఖర్ (కేరళ బిజెపి అధ్యక్షులు, మాజీ కేంద్రం మంత్రి)
ప్రతిసారి టెక్నాలజీ భవిష్యత్తు గురించి మాట్లాడే నేను, ఈసారి కొద్దిగా దారి మళ్లించి మరొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మన భారతదేశ భవిష్యత్తుకు చాలా కీలకమైన అంశం. మంచి పరిపాలన వల్ల లభించే ప్రయోజనాలు ఏమిటి? అది లేకపోతే సమాజం చెల్లించే మూల్యం ఎంత? ఈ విషయం ఇప్పటి యువతకు అర్థమవుతోందా లేదా? అనేదే నా ఆలోచన.
నేను ప్రజారాజకీయంలోకి వచ్చి ఇరవై ఏళ్లు దాటింది. ఈ కాలంలో రాజకీయ చర్చలు కేవలం అరుపులు, కేకలకే పరిమితం కావడం చూస్తున్నాను. ప్రభుత్వం తన పని సరిగ్గా చేస్తోందా లేదా అనే అసలు విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 2014 తర్వాత ఓటర్లుగా మారిన 15 కోట్ల మంది యువతకు, రాబోయే పదేళ్లలో రాబోయే కోట్లాది మందికి దీనికి సరైన సమాధానం తెలియడం అత్యవసరం.
2004 నుంచి 2014 వరకు ఉన్న కోల్పోయిన దశాబ్దానికి, ఇప్పుడు తయారవుతున్న కొత్త భారతానికి తేడా ఏంటి అనేది ఇక్కడ అసలు ప్రశ్న.ఈ తేడా కేవలం కొన్ని ప్రభుత్వ పథకాల జాబితా మాత్రమే కాదు. పౌరుడికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధంలో వచ్చిన మార్పు. ఆ పాత దశాబ్దంలో ఒక యువకుడి భవిష్యత్తు అతనికి ఉన్న ప్రతిభ మీద ఆధారపడి ఉండేది కాదు. 'నీకు ఎవరు తెలుసు?' అనే కాంటాక్టుల మీదే ఆధారపడేది. ప్రతిభ చూసి కాంట్రాక్టులు ఇచ్చేవారు కాదు. గొప్ప ఆలోచనలకు నిధులు రాకపోయేవి, కేవలం రాజకీయం ఉన్న వారికే అవకాశాలు దక్కేవి.
2012 క్రెడిట్ స్విస్ రిపోర్ట్ ప్రకారం, భారత బ్యాంకింగ్ వ్యవస్థలోని మొత్తం ఆస్తుల్లో 98 శాతాన్ని కేవలం 10 వ్యాపార సమూహాలకే అప్పుగా ఇచ్చేశారు. అదే సమయంలో త్రిస్సూర్ లో చిన్న షాపు నడుపుకునే మహిళకు గానీ, సూరత్ లో చిన్న పరిశ్రమ పెట్టాలనుకున్న యువ ఇంజనీర్‌కు గానీ రుణాలు దక్కలేదు.
ప్రభుత్వం పంపే ప్రతి రూపాయిలో పదిహేను పైసలు మాత్రమే పేదలకు చేరుతున్నాయని నాటి ప్రధానే స్వయంగా ఒప్పుకున్నారు. కానీ జామ్ (JAM - జన్ ధన్, ఆధార్, మొబైల్) విప్లవం కేవలం ఒక సాంకేతిక విప్లవం మాత్రమే కాదు. అది ఒక పాలనా విప్లవం. దళారుల వ్యవస్థను అది పూర్తిగా రద్దు చేసింది. 2014 నుంచి ఇప్పటివరకు రూ. 53 లక్షల కోట్లకు పైగా నగదు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో పడింది.
నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం తొమ్మిదేళ్లలోనే దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దేశంలో పేదరికం 29.17 శాతం నుంచి 11.28 శాతానికి పడిపోయింది. పీఎం కిసాన్ ద్వారా 9.5 కోట్ల మంది రైతులకు రూ. 4.47 లక్షల కోట్లు నేరుగా అందాయి. మధ్యలో ఒక్క రూపాయి కూడా దళారులు నొక్కేయలేదు. మంచి పాలన ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. పేదరికం నుంచి బయటపడ్డ కుటుంబం మళ్లీ వెనక్కి వెళ్లకుండా నిలబడుతుంది.
కానీ తప్పుడు నిర్ణయాలు కూడా అంతే వేగంగా నష్టం చేస్తాయి. కర్ణాటక ఉదాహరణే తీసుకోండి: ఉచిత గ్యారెంటీ పథకాల కోసం రూ. 52,000 కోట్లు ఖర్చు చేయడం వల్ల, ఒకే ఏడాదిలో ఆ రాష్ట్ర అప్పు రూ. 90,280 కోట్ల నుంచి రూ. 1,04,000 కోట్లకు పెరిగింది. ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ రోడ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు కట్టాల్సిన మూలధన ఖర్చులకు డబ్బులు లేకుండా పోయాయి.
ఇక కేరళ విషయానికి వస్తే, పదేళ్ల నిరంతర వామపక్షాల పాలన వల్ల రాష్ట్ర అప్పు రూ. 5.07 లక్షల కోట్లకు చేరిందని 2026 జూన్‌లో వారి ప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేసింది. 2025 లో కేరళ రాష్ట్రం 84 రోజుల పాటు ఆర్బీఐ ఓవర్‌డ్రాఫ్ట్‌లోనే ఉంది. అభివృద్ధి పనులకు చేసే ఖర్చు అక్కడ కేవలం 1.3 శాతం మాత్రమే, ఇది జాతీయ సగటులో సగం కంటే తక్కువ.
అన్యాయాలపై నిరసన తెలపడం ప్రజాస్వామ్యానికి జీవనాడి. భారత చరిత్రలో ఇటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి, నేను కూడా కొన్నింటిలో పాల్గొన్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరుడికి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. రాజకీయం కోసం కావాలనే పాలనను స్తంభింపజేస్తున్నారు. తమ దగ్గర సరైన ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకపోవడాన్ని దాచడానికి, నిరంతరం ఏదో ఒక సంక్షోభం ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు. చట్టాలు కాకుండా పార్లమెంటును అడ్డుకోవడం, రహదారులను దిగ్బంధించడం పరిపాటిగా మారింది.
ఇది ఎంతమాత్రమూ ప్రజాస్వామ్య బాధ్యత కాదు. చర్చలకు బదులు కేకలను ప్రత్యామ్నాయంగా మార్చడమే. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది యువతరం. గందరగోళం సృష్టించడమే పరిపాలన అనుకునే దుస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల యువత రాజకీయంపై నమ్మకం కోల్పోయి, నాయకులను ప్రశ్నించడం మానేసే ప్రమాదం ఉంది.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం భారత్. ఈ తరం అలవర్చుకునే రాజకీయ ఆలోచనలే రాబోయే 50 ఏళ్ల భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
ఉత్తర ప్రదేశ్‌ను చూడండి: తొమ్మిదేళ్లలో బిమారు (BIMARU) అంటే పేద రాష్ట్రం నుంచి రూ. 36 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. గొడవలు ఆగిపోయాయి, పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. మహారాష్ట్రను చూస్తే దేశంలోనే అత్యధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అదే సమయంలో కేరళ, కర్ణాటక పరిస్థితి చూడండి: అప్పుల భారం పెరిగిపోయి అభివృద్ధి ఆగిపోయింది.
నేటి భారతీయ యువత ముందర ఉన్నది భావజాల ప్రశ్న కాదు, వారి సొంత భవిష్యత్తు ప్రశ్న. ఏ వ్యవస్థ మీకు మంచి అవకాశం ఇస్తుంది? మీ ప్రతిభ, కష్టం మీద ఆధారపడే వ్యవస్థా? లేక నాయకులతో సంబంధాలు ఉంటేనే పనిచేసే వ్యవస్థా? గ్రామానికి రోడ్డు వేసి ఉపాధి కల్పించే ప్రభుత్వమా? లేక ఈనాటి ఉచితాల కోసం అప్పులు చేసి రేపటి అభివృద్ధిని నాశనం చేసే ప్రభుత్వమా?
నిజానికి ఈ వ్యాసం టెక్నాలజీకి దూరంగా ఏమీ లేదు. ఒక మంచి టెక్నాలజీ వ్యవస్థ ఎలా పారదర్శకంగా పనిచేస్తుందో, సుపరిపాలన కూడా ప్రజలకు అలాగే పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలి.
ప్రజాస్వామ్యంలో మన ఎంపిక స్పష్టంగా ఉండాలి: ఏదైనా నిర్మించే ప్రభుత్వం కావాలా? లేక రాబోయే తరాలను పేదరికంలోకి నెట్టే ప్రభుత్వం కావాలా? అదే అసలైన విషయం, మిగిలినదంతా అనవసరమైన గోల.
(రచయిత మాజీ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, నేమం నియోజకవర్గ ఎమ్మెల్యే, కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు)






