- Home
- Feature
- Hindu Population In India : దేశంలో అత్యధిక హిందువులు ఉన్న టాప్ 5 రాష్ట్రాలు ఇవే.. తెలుగు స్టేట్స్ ర్యాంక్ ఎంతంటే?
Hindu Population In India : దేశంలో అత్యధిక హిందువులు ఉన్న టాప్ 5 రాష్ట్రాలు ఇవే.. తెలుగు స్టేట్స్ ర్యాంక్ ఎంతంటే?
హిందువులు మెజారిటీగా ఉన్న దేశం ఇండియా. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అతి ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి. అలాగే ప్రపంచంలో మూడో అతిపెద్ద మతం కూడా ఇదే. మరి మన దేశంలో అత్యధికంగా హిందువులు నివసిస్తున్న టాప్-5 రాష్ట్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

1. హిమాచల్ ప్రదేశ్ : 95%
హిమాలయాల పర్వత శ్రేణుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ జనాభాలో 95 శాతం మంది హిందువులే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్ర జనాభా 68 లక్షలకు పైగా ఉంది.. ఇందులో 65 లక్షలకు పైగా హిందూ జనాభానే. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హిందువుల మెజారిటీ స్పష్టంగా కనిపిస్తుంది... అయితే హమీర్పూర్ లో అత్యధికంగా 98.82 శాతం మంది హిందువులే.
ఈ రాష్ట్రంలో ఐదు శక్తిపీఠాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్‌లో హిందువులదే మెజారిటీ… అందుకే ఈస్థాయిలో ఆలయాలు ఉన్నాయి.
2. ఒడిశా : 94%
ఒడిశాలో నివసించే వారిలో 94 శాతం మంది హిందూ మతాన్ని పాటిస్తున్నారు. ది ఇండియన్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం… హిమాచల్ ప్రదేశ్ తర్వాత అత్యధిక హిందువులు ఉన్న రాష్ట్రం ఒడిశానే. రాష్ట్రంలో మొత్తం 4.19 కోట్ల జనాభా ఉంటే ఇందులో 3 కోట్లు 93 లక్షలకు పైగా హిందూ జనాభానే ఉంది. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయం ఈ రాష్ట్రంలోనే ఉంది.
3. ఛత్తీస్‌గఢ్ : 93%
దట్టమైన అడవులు, జలపాతాలకు ఫేమస్ అయిన ఛత్తీస్‌గఢ్ జనాభాలో 93 శాతం మంది హిందువులే. ఇక్కడ 2 కోట్లకు పైగా హిందువులు ఉంటారు. చత్తీస్ గడ్ లో గిరిజన జనాభా కూడా ఎక్కువే. అత్యధిక హిందువులు నివసిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్ మూడో స్థానంలో నిలిచింది.
4. మధ్యప్రదేశ్ : 91%
విస్తీర్ణం పరంగా దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్, జనాభా పరంగా ఐదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 91 శాతం మంది హిందువులు నివసిస్తున్నారు.. 6.60 కోట్లమంది ఉంటారు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ రాష్ట్రంలోనే ఉంది.
5. గుజరాత్ : 89%
2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్ జనాభా సుమారు 6.2 కోట్లు. ఇక్కడ నివసించే వారిలో 89 శాతం మంది హిందువులే… ఏకంగా 5.35 కోట్లమంది హిందువులు ఉంటారట. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి ప్రముఖ నాయకుల సొంత రాష్ట్రం ఇదే. ఈ గుజరాత్‌లోనే ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం ఉంది.
తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్ లో 88 శాతం హిందువులు ఉన్నారు. మొత్తం జనాభా సుమారు 5.78 కోట్లు అయితే ఇందులో 4.48 కోట్లమంది హిందువులే. తెలంగాణలో ఇది మరింత తక్కువగా ఉంది… మొత్తం జనాభా 3.86 కోట్ల మంది అయితే 3 కోట్లమంది హిందువులు ఉన్నారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ జనాభా 90 శాతానికి పైగా ఉండేది. మన పక్కరాష్ట్రం కర్ణాటకలో సుమారు 84 శాతం మంది హిందువులు ఉన్నారు. చాలారాష్ట్రాల్లో హిందూ జనాభా ఎక్కువగానే ఉంది.
జనాభా పరంగా అతిపెద్ద హిందూ రాష్ట్రాలు..
జనాభా శాతం పరంగా కాకుండా అత్యధిక హిందూ జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఇక్కడ సుమారు 16 కోట్లమంది హిందువులు ఉన్నారు... రాష్ట్ర మొత్తం జనాభాలో ఇది 79 శాతం. ఇక మహారాష్ట్రలో 9 కోట్లు (79 శాతం), బిహార్ లో 8 కోట్లు (82 శాతం), పశ్చిమ బెంగాల్ లో 6 కోట్లు (70 శాతం) హిందూ జనాభా ఉంది.








