దేశంలో కీలక నేతగా ఎదిగిన ములాయం సింగ్ యాదవ్ పొలిటికల్ కేరీర్‌లో.. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 1980 దశకం చివరి సంవత్సరాల్లో చోటుచేసుకున్న పరిణామాలు కీలకంగా ఉన్నాయి. అప్పటి పరిస్థితులను ఒడిసిపట్టి ఒక కొత్త ఒరవడిని ఆయన ప్రవేశ పెట్టారు. ఆ ఒరవడి రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసింది.

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ములాయం సింగ్ యాదవ్.. గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేశంలో కీలక నేతగా ఎదిగిన ములాయం సింగ్ యాదవ్ పొలిటికల్ కేరీర్‌లో.. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 1980 దశకం చివరి సంవత్సరాల్లో చోటుచేసుకున్న పరిణామాలు కీలకంగా ఉన్నాయి. అప్పుడు సంఘపరివారుల అయోధ్య ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక విషయాల్లో తడబడుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం యాదవులు ఒక స్పష్టమైన అవగాహన వస్తున్నారు. 

ఇలాంటి కీలక తరుణంలో ములాయం సింగ్ యాదవ్ కూడా రాజకీయ వేదిక మీదికి చేరుకున్నారు. అప్పటి పరిస్థితులను ఒడిసిపట్టి ఒక కొత్త ఒరవడిని ఆయన ప్రవేశ పెట్టారు. ఆ ఒరవడి రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసింది. అది ఆయనను యాదవులు, ముస్లింలకు తిరుగులేని నేతగా నిలబెట్టింది. మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. ఆ ఒరవడి ఏమిటీ? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం..

ములాయం సింగ్ యాదవ్ సరైన సమయంలో సోషల్ ఇంజనీరింగ్ చేపట్టారు. అంటే.. కొన్ని వర్గాలను సమర్థంగా తన వైపు తిప్పుకోగలిగారు. సమీకరించుకోగలిగారు. ముస్లింలు, యాదవుల జనాభా ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నది. కానీ, ఈ రెండు వర్గాలకు అప్పటి రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమైంది. ఆ సమయంలో ములాయం సింగ్ యాదవ్ వారికి అందివచ్చిన నేతగా ఎదిగారు.

ముస్లింల నేతగా..
1984లో రాజీవ్ గాంధీ ప్రధానిగా వచ్చినప్పుడు రామజన్మభూమి గురించి వీహెచ్‌పీ ఓ ఆందోళన ప్రారంభించింది. ఈ ఆందోళన విస్తృతం అవుతున్నది. ఈ ఉద్యమం మాటున హిందువులను దూరం చేసుకోవద్దని రాజీవ్ గాంధీ ఆలోచించారు. అరుణ్ నెహ్రూ సలహాతో ఆయన తాళాలు తొలగించి హిందువులు పూజించడానికి అవకాశం కల్పించాడు. ముస్లింలు అసంతృప్తికి గురయ్యారు. కానీ, సంఘ్ పరివార్ అప్పుడు మరో దశ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. రామ మందిర నిర్మాణానికి ఇటుకలను సేకరించడం ప్రారంభించింది. ఇక్కడి దాకా వచ్చాక రాజీవ్ వెనక్కి వెళితే విఫలమైనట్టే?

Also Read: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత..

అయోధ్యలో హిందువులు, ముస్లింలు నిర్మించడానికి కోర్టు అనుమతులు లేవు. అయినప్పటికీ అక్కడ ఇటుకలు పేర్చడానికి అప్పటి ప్రధాని రాజీవ్ అనుమతించారు. ఇది ముస్లింలను ఆగ్రహానికి గురి చేసింది. కాంగ్రెస్ లౌకిక పార్టీ అనే మాటనే మరిచిపోయేలా ఆయన 1989 ఎన్నికల క్యాంపెయిన్‌ను అయోధ్య నుంచే ప్రారంభించారు. బహుశా అప్పుడు రామరాజ్యాన్ని స్థాపిస్తామని హామీ ఇచ్చారు! రాజీవ్ గాంధీ అనాలోచిత నిర్ణయాలకు ఓటర్లు పార్టీని శిక్షించారు. ఆ ఎన్నికల్లో పార్లమెంటులో కాంగ్రెస్ 415 సీట్ల నుంచి 197 సీట్లకు పడిపోయింది.

రాజీవ్ మొదలు పెట్టిన పనిని పీవీ నర్సింహరావు మరింత సమర్థంగా చేశారు. 1991 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టారు. ఒకే సమస్యపై రెండు పార్టీల ఫోకస్ ఉండటం మూలంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య సఖ్యత ఉండింది. బాబ్రీ మసీదును కూల్చేసే ముప్పు ఉన్నదనే ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఉన్నప్పటికీ రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసింది కాబోలు అనే వాదనలు ఉన్నాయి. 1992 డిసెంబర్ 6న లౌకిక భారత చరిత్ర చాలా వరకు మారిపోయింది. అప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు అంతా తమ భావాలు వినే, తమ గళం ఎత్తే నాయకుడి కోసం ఎదురుచూసింది. ఆ సమయంలో ములాయం సింగ్ మాత్రమే కరసేవకులపై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. ముస్లింలకు ములాయం ఒక ఆశాకిరణంగా కనిపించారు.

యాదవ్‌ల అస్తిత్వ ఎరుక..
1980ల్లో యాదవ్‌లు తమ అస్తిత్వాన్ని ఎప్పుడూ ఎరుకలో ఉంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ జనాభాగల వెనుకబడిన కర్షకవర్గం వీరు. రాజకీయ, పాలన అధికారం కోసం కాంక్షించారు. వారు తమ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులకే ఓటేయడం మొదలు పెట్టారు. ఈ ఓబీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో 1979లోనే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీపీ మండల్ సారథ్యంలో కమిషన్ వేసింది. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 22.5 రిజర్వేషన్‌లకు అదనంగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆ కమిషన్ చెప్పింది. 1980లో కమిషన్ నివేదిక సమర్పించే సమయానికి మొరార్జీ ప్రభుత్వం కూలింది. ఇందిరా, రాజీవ్ ప్రభుత్వాలు ఈ నివేదికను అమలు చేయకున్నా.. యూపీకి చెందిన వీపీ సింగ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక 1990లో ఈ కమిషన్ అమలుకు ఆదేశించారు. కానీ, కొన్ని ఉన్నత కులాల విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆత్మహత్యాలూ చోటుచేసుకున్నాయి. వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ఈ కమిషన్ నివేదిక అమలు రక్షించలేకపోయింది. కానీ, వీపీ సింగ్‌కు మద్దతుగా ఉన్న ములాయం సింగ్ యాదవ్‌కు మాత్రం మంచి బలాన్ని ఇచ్చింది.

యూపీలో క్షీణిస్తున్న కాంగ్రెస్‌కు కూడా మండల్ కమిషన్ అమలు అవసరమని భావించింది. పీవీ నర్సింహరావు ప్రభుత్వం 1991లో దీని అమలుకు మళ్లీ ఆదేశాలు ఇచ్చింది. ఎమర్జెన్సీలో రాటుదేలిన ములాయం సింగ్ అటు ముస్లింల ఆందోళనలను, యాదవ్‌ల మద్దతును సులువుగా ఆయనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఫలితంగా 1989లో యూపీ సీఎం అయ్యారు. 1989-91, 1993-95, 2003-07ల కాలంలో ఆయన యూపీకి మూడు సార్లు సీఎంగా చేశారు.అందుకే ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం, యాదవ్‌ల ఓట్లను మలుపుకుని విజయబాటను వేసుకున్న నేతగా ములాయం సింగ్‌ను పేర్కొంటారు. ఇప్పటికీ సమాజ్‌వాదీ పార్టీకి ఈ రెండు వర్గాల నుంచి విశేష ఆదరణ ఉన్నది.

Also Read: అతి సాధారణ కుటుంబం నుంచి దేశంలో కీలక నాయకునిగా.. ములాయం సింగ్ ఫ్యామిలీ, రాజకీయ ప్రస్తానం ఇదే..

బీపీ మండల్ కమిషన్ తర్వాతి పరిణామాలు ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలకు కుల సమీకరణలు కీలకంగా మార్చివేశాయి. అయితే, ఈ సమీకరణలు ఎప్పటికీ ములాయం సింగ్ యాదవ్‌కు అనుకూలించాయని కాదు. బీఎస్పీ కూడా దీన్ని ఆసరాగా చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. కేవలం ఎస్సీలనే కాదు, ఓబీసీలను కూడా బీఎస్పీ టార్గెట్ చేసుకుని పవర్ సొంతం చేసుకుంది. కానీ, మండల్ కమిషన్‌తో బీజేపీకి కక్కలేక మింగలేక అనే పరిస్థితి ఎదురైంది. అయితే, అయోధ్య అంశాన్ని తీసుకుని కులాలకు అతీతంగా మతాన్ని ఆధారం చేసుకుని నిలబడింది. కాంగ్రెస్ మాత్రం 1985లో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయింది.