సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యే వరకు ఆయ‌న‌  ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా సాగింది. ఈ కథనంలో ఆయ‌న జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం..   

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ములాయం సింగ్ యాదవ్.. గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యే వరకు ఆయ‌న‌ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా సాగింది. ఈ కథనంలో ఆయ‌న జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం..

కుటుంబ నేప‌థ్యం
చాలా సాధారణ కుటుంబంలో పుట్టి, మూడుసార్లు యూపీ ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని సైఫాయ్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు షుగర్ సింగ్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ తల్లి పేరు మూర్తి దేవి. వీరికి ములాయం సింగ్ యాదవ్‌తో పాటు.. న‌లుగురు కుమారులు, ఒక కుమార్తె. ఈ విధంగా ములాయం సింగ్ యాదవ్‌కు ఐదుగురు తోబుట్టువులు. అతని సోదరుల పేర్లు రతన్ సింగ్ యాదవ్, అభయ్‌రామ్ సింగ్, శివపాల్ సింగ్ యాదవ్, రాజ్‌పాల్ సింగ్ యాదవ్. ఆయ‌న‌ ఏకైక‌ సోదరి పేరు కమలా దేవి.

విద్యాభ్యాసం
ములాయం సింగ్ యాదవ్ చాలా సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. వ్య‌వ‌సాయ‌మే వారి కుటుంబానికి జీవ‌నాధారం. వ్య‌వ‌సాయ‌మే వారి కుటుంబ వృత్తి. దీంతో చదువుకు సంబంధించి ఆయన ఇంట్లో ప్రత్యేక వాతావరణం లేదు. కానీ.. ఆయ‌న‌కు చిన్నప్పటి నుండి చదవడం మరియు రాయడం అంటే చాలా ఇష్టం. ఆయ‌న ప్రాథ‌మిక విద్య ఎటావాలోని ప్రభుత్వ పాఠశాలలో సాగింది. చదువుకునే రోజుల్లో.. ఆయ‌న పాఠశాలకు వెళ్తూ.. వ్యవసాయంలో తన కుటుంబానికి సహాయం చేసేవాడు. 

ములాయం సింగ్ త‌న పాఠ‌శాల‌ విద్యను పూర్తి చేసిన తర్వాత.. ఇటావాలోని కర్మక్షేత్ర కళాశాలలో ఉన్న‌త చ‌దువు అభ్య‌సించారు. క‌ళ‌శాల జీవితంలోనే ఆయ‌న‌కు రాజకీయాలపై అమితాసక్తి ఏర్పడింది. అందుకే ఇటావాలోని కర్మక్షేత్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల నుండి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అనంత‌రం ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ డిగ్రీ కూడా పొందారు.



చదువు పూర్తయ్యాక ములాయం సింగ్ యాదవ్ కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. అతను జస్వంత్‌నగర్, ఇటావా సహకార బ్యాంకు డైరెక్టర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అనంత‌రం కొన్నేండ్ల పాటు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా ప‌నిచేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

రాజకీయ జీవితం
ములాయం సింగ్ యాదవ్ తన జీవితంలో ఎప్పుడూ స‌మాజానికి ఏదోక మంచి పని చేయాలని కోరుకునేవాడు. నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం. ప్ర‌జ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డం. ఆ స‌మ‌స్య‌లను నిత్యం చ‌ర్చించ‌డంలో చాలా ఆస‌క్తిక‌న‌బ‌రిచే వాడు. ఆయ‌న త‌న క‌ళాశాల జీవితంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో పాల్గొనడం ప్రారంభించాడు. 

రాజకీయ ప్రపంచంలో చౌదరి నాథూ సింగ్‌ను ములాయం యాదవ్ తన గురువుగా భావించేవారు. నాథూసింగ్ పోటీ చేసే.. జస్వంత్ నగర్ స్థానం నుంచి ములాయం సింగ్ యాదవ్ కూడా తన జీవితంలో మొదటి ఎన్నికల్లో పోటీ చేశారు.

ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితం 1967లో ప్రారంభమైంది. అదే సంవత్సరం.. ఆయ‌న గురుకుల స్థానమైన జస్వంత్ నగర్ నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈ ఎన్నిక‌లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. ఆయ‌న‌ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆయ‌న త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్న‌డు వెనుతిరిగి చూసుకోలేదు. 



ములాయం సింగ్ రాజ‌కీయ‌ జీవితంతో 1977 సంవత్సరం చాలా క్లిష్ట స‌మ‌యం. ఉత్తరప్రదేశ్‌లోనే కాదు. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయం ఇది. ఈ వ్య‌తిరేక‌త‌ కారణంగా యూపీలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 1980లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అది రాగానే ములాయం సింగ్ యాదవ్‌ను రాష్ట్ర మంత్రిగా చేశారు. ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడయ్యారు. కానీ, ఆ త‌రువాత జ‌రిగిన‌ ఎన్నిక‌లో ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత లోక్ దళ్ పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేశారు.

అతి తక్కువ సమయంలోనే ములాయం సింగ్ దేశంలోని ముఖ్య నాయకులలో స్థానం సంపాదించుకున్నారు. 1996లో తొలిసారిగా మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం సింగ్ యాదవ్ పాల్గొన్న సమయం ఇది. అదే సమయంలో ఆయన దేశ రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.

సమాజ్ వాదీ పార్టీ స్థాప‌న‌ 
చాలా ఏళ్ల పాటు వివిధ పార్టీలతో కలిసి పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ 1992లో సొంత పార్టీని స్థాపించారు. తన పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ అని పేరు పెట్టారు. తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు. అతను తన పార్టీతో OBC, యాదవ్ కమ్యూనిటీని కలుపుకున్నాడు. ములాయం సింగ్ యాదవ్ సెక్యులర్ నాయకుడు. అందుకే పెద్ద సంఖ్యలో యూపీ ముస్లింలు కూడా ఆయన పార్టీలో చేర్చుకున్నారు. ఈ విధంగా.. ఓబీసీ, ముస్లింల‌ను త‌న ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. ఈ బలంతో మూడు సార్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. సమాజ్ వాదీ పార్టీకి 2012 చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది సమాజ్‌వాదీ పార్టీ పూర్తి మెజారిటీతో విజయం సాధించింది.

వ్య‌క్తిగ‌త జీవితం 
ములాయం సింగ్ యాదవ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతని మొదటి భార్య పేరు మాల్తీ దేవి. ఆమెతో ములాయం సింగ్ యాదవ్ వివాహం 1957లో జరిగింది. వీరిద్దరికీ అఖిలేష్ యాదవ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆయ‌న‌ సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. యూపీ రాజీకీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌( అఖిలేష్ యాద‌వ్) 2012 నుండి 2017 వరకు యూపీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ తల్లి 2003లో మరణించారు.

మాల్తీ దేవి మరణం తర్వాత ములాయం సింగ్ యాదవ్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2003లో.. అతను తన పార్టీ కార్యకర్త సాధనా గుప్తాకు తన భార్య హోదాను ఇచ్చాడు. సాధన గుప్తా వ్యాపారవేత్త చంద్రప్రకాష్ గుప్తాను 1986లో వివాహం చేసుకున్నారు. అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. భర్త నుంచి విడిపోయిన తర్వాత సాధన సమాజ్‌వాదీ పార్టీలో చేరింది. సమాజ్ వాదీ పార్టీలో చేరిన తర్వాత ములాయం సింగ్ యాదవ్, సాధన మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ములాయం సింగ్ తన భార్య మరణానికి ముందు సాధనతో ఉన్న సంబంధం గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ సాధనను తన భార్యగా పరిగణించడమే కాకుండా తన ఇంటిపేరును తన కొడుకు ప్రతీక్‌కి పెట్టాడు.

అఖిలేష్ యాదవ్‌కు సవతి తల్లి సాధన అంటే అస్సలు ఇష్టం లేదు. సాధన విషయంలో తండ్రికి తరచూ కోపం వచ్చేది. తర్వాత విషయం హద్దులు దాటడంతో తండ్రితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం సాధన, ప్రతీక్ యాదవ్ రాజకీయాల్లోకి రాకూడదని అఖిలేష్ యాదవ్ షరతు పెట్టారు.

సాధన, ప్రతీక్ యాదవ్ ఒప్పందం ప్రకారం రాజకీయాల్లోకి రాలేదు. అయితే ప్రతీక్ భార్య అపర్ణ బిష్త్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారు. కొన్నాళ్లు సమాజ్ వాదీ పార్టీలో ఉన్నా.. కుటుంబ కలహాలతో పార్టీని వీడారు. అపర్ణ ప్రస్తుతం బీజేపీలో చేరిపోయింది. ములాయం సింగ్ రెండో భార్య సాధన గుప్తా కూడా ఇటీవ‌ల‌ మరణించారు. ఆమె 2022 జూలై1న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. అక్కడ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆమె 62 ఏళ్ల వయసులో మరణించారు.