సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. చాలా రోజులుగా ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ములాయం సింగ్ యాదవ్ మరణవార్తను ఆయన కుమారుడు, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. ‘‘నా గౌరవనీయమైన తండ్రి, అందరి నాయకుడు ఇక లేరు’’ అని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. 

ములాయం సింగ్ యాదవ్‌ 1939 నవంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని సైఫాయ్‌లో జన్మించారు. ఆయన తండ్రి షుగర్.. సింగ్ యాదవ్, తల్లి.. మూర్తి దేవి. ఆయన తొలుత మాల్తీ దేవిని వివాహం చేసుకున్నారు. ఆమె మరణానంతరం సాధన గుప్తాను వివాహం చేసుకున్నారు. 

Scroll to load tweet…

ములాయం సింగ్ 1960లలోనే రాజకీయంగా చాలా యాక్టివ్‌గా మారారు. ఆయ‌న‌ రామ్ మనోహర్ లోహియా శిష్యుడు. రామ్ మనోహర్ లోహియా దగ్గర రాజకీయాలలో మెలకువలు నేర్చుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ 1967లో జస్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తన మొదటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. చాలా ఏళ్ల పాటు వివిధ పార్టీలతో కలిసి పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ 1992లో సొంత పార్టీని స్థాపించారు. తన పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ అని పేరు పెట్టారు. తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు. అతను తన పార్టీతో OBC, యాదవ్ కమ్యూనిటీని కలుపుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ సెక్యులర్ నాయకుడు. అందుకే పెద్ద సంఖ్యలో యూపీ ముస్లింలు కూడా ఆయన పార్టీలో చేర్చుకున్నారు. ఈ విధంగా.. ఓబీసీ, ముస్లింల‌ను త‌న ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. 

మొత్తంగా మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ములాయం సింగ్ యాదవ్ చివరగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి లోక్‌సభ సభ్యునిగా కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా ములాయం సింగ్ యాదవ్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.