రాజస్తాన్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, పిల్లలకు హిందీలో కాదు.. ఇంగ్లీష్‌లో బోధించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పేదల పిల్లలు ఇంగ్లీషు నేర్చుకోవద్దని బీజేపీ నేతలు కోరుకుంటారని, కానీ, వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కు పంపిస్తారని వివరించారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా, భాష పై మాట్లాడారు. రాజస్తాన్‌లో ఆయన మాట్లాడుతూ, పిల్లలకు పాఠశాలల్లో హిందీలో కాదు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాలని అన్నారు. బీజేపీ నేతలు స్కూల్స్‌లో హిందీ మీడియాలో బోధించాలని చెబుతారని, కానీ, వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కు పంపిస్తారని విమర్శించారు.

‘స్కూల్స్‌లో ఇంగ్లీష్ బోధించాలని బీజేపీ నేతలు కాంక్షించరు. కానీ, వారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కు పంపిస్తారు. నిజానికి వారు పేద రైతులు, కార్మికుల పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని కోరుకుంటున్నారు. ఆ చిన్నారులు పెద్దగా ఆలోచించి, ఆ కష్టాల్లో నుంచి బయటకు రావాలని బీజేపీ వారు కోరుకోవడం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.

అల్వార్‌లో ఓ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘భారత్ మినహా మిగతా ప్రపంచంతో మీరు మాట్లాడాలనుకుంటే హిందీ పని చేయదు. ఇంగ్లీష్ భాషే అవసరం అవుతుంది. పేద రైతులు, కార్మికుల పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికన్లను వారి భాషలోనే ఓడించాలని మేం కోరుకుంటున్నాం’ అని తెలిపారు.

Also Read: అధికారం కోసమే బీజేపీ భాష చిచ్చుపెడుతోంది.. హిందీ విధింపున‌కు వ్యతిరేకంగా త‌మిళ‌నాడు అసెంబ్లీ తీర్మానం

కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా బీజేపీ నేతల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కు వెళ్లుతున్నారని వివరించారు. అయితే, హిందీ, తమిళం వంటి ఇతర భాషలు చదకూడదని తాను చెప్పడం లేదని తెలిపారు. కానీ, ‘మిగతా ప్రపంచంతో మీరు మాట్లాడాలంటే మాత్రం ఇంగ్లీష్ తెలిసి ఉండాలి’ అని వివరించారు.

రాజస్తాన్‌లో 1,700 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభించారని రాహుల్ గాంధీ తెలిపారు. పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని, అమెరికా పిల్లలతో పోటీ పడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అందుకే రాజస్తాన్‌లో 1,700 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఓపెన్ చేసినందుకు తాను సంతోషంగా ఉన్నారని వివరించారు.

బీజేపీ హిందీ భాషను వేరే వారిపై రుద్దుతున్నదని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.