Asianet News TeluguAsianet News Telugu

అధికారం కోసమే బీజేపీ భాష చిచ్చుపెడుతోంది.. హిందీ విధింపున‌కు వ్యతిరేకంగా త‌మిళ‌నాడు అసెంబ్లీ తీర్మానం

Tamil Nadu: అధికారం కోసం భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) భాషను ఉపయోగిస్తోందని త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఏంకే ఆరోపించింది. తాజాగా, హిందీ విధింపునకు వ్యతిరేకంగా తీర్మానాన్ని త‌మిళ‌నాడు అసెంబ్లీ ఆమోదించింది.

BJP is using the language for power.. Tamilnadu assembly resolution against imposition of Hindi
Author
First Published Oct 19, 2022, 11:19 AM IST

Hindi imposition: త‌మిళ‌నాడులో భాష ర‌చ్చ కొన‌సాగుతూనే ఉంది. హిందీ విధింపున‌కు వ్య‌తిరేకంగా అక్క‌డి అధికార పార్టీ డీఎంకే.. కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. బీజేపీ అధికారం దాహం తీర్చుకోవ‌డానికి భాష చిచ్చును పెడుతోంద‌ని డీఎంకే ఆరోపించింది. "భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హిందీని అధికారానికి ప్రతీకగా మార్చడానికి ప్రయత్నిస్తోంది" అని త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంగ‌ళ‌వారం నాడు తమిళనాడు అసెంబ్లీలో హిందీ భాష విధింపున‌కు వ్య‌తిరేకంగా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. 

హిందీ విధింపు తీర్మానానికి ముందు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కే.పళనిస్వామి నేతృత్వంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యకలాపాలకు ముందు వాకౌట్ చేశారు. "ఆధిపత్య భాషా ప్రయోగానికి వ్యతిరేకంగా మా అభిప్రాయాన్ని వినిపించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేను సభా వేదికపై ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను" అని స్టాలిన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. “1938 నుండి హిందీని విధించడం నిరంతరం జరుగుతూనే ఉంది. మేము ఈ భాష‌ విధింపును వ్యతిరేకిస్తూనే ఉన్నాము. కేంద్రప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీ పాలనలో హిందీని రుద్దడం అలవాటైంది.. ఇప్పుడు విద్యారంగానికి కూడా విస్తరిస్తోందని" స్టాలిన్ అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు వంటి ఉన్నత విద్యా సంస్థల్లో హిందీతో సహా భారతదేశంలోని షెడ్యూల్డ్ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన అధికారిక భాషలపై పార్లమెంటరీ కమిటీ నివేదికపై పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ తీర్మానం వచ్చింది. మంగళవారం నాడు కేంద్రంపై తన విమ‌ర్శ‌ల‌ దాడిని కొనసాగిస్తూ స్టాలిన్.. "బీజేపీ ఇంగ్లీషును పరిపాలన నుండి పూర్తిగా తొలగించాలని ప్రయత్నిస్తోంది... ప్రజలు ఇంగ్లీషు పరిజ్ఞానం పొందకుండా నిరోధించాలని వారు కోరుతున్నారు. మాట్లాడటం కోసమే రాష్ట్ర భాషలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కాకపోతే వారి గుండె హిందీ కోసమే కొట్టుకుంటుంది. బీజేపీ ఇతర భాషలను ప్రేమిస్తుందన్న వాదన నిజమైతే, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లోని తమిళంతో సహా అన్ని భాషలను కేంద్ర ప్రభుత్వ పరిపాలనా భాషలుగా ప్రకటించడానికి వారు సిద్ధంగా ఉన్నారా?" అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

పార్లమెంటరీ నివేదిక వార్తల నేపథ్యంలో, స్టాలిన్ ఇటువంటి ప్రయత్నాలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి రెండుసార్లు లేఖ కూడా రాశారు. మంగళవారం అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు తన ద్వంద్వ భాషా విధానం-ఇంగ్లీషు, తమిళంలో స్థిరంగా ఉందని తెలిపారు. దేశంలోని అధికారిక భాషల జాబితాలో అన్ని రాష్ట్ర భాషలను చేర్చాలని వారు కోరుతున్నారని అన్నారు. “హిందీయేతర మాట్లాడేవారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ హిందీని విధించకూడదు. హిందీ మాట్లాడేవారికే ప్ర‌త్యేక‌ ప్రాధాన్యత ఇవ్వకూడదు.. అలాంటి చర్య రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుంది” అని తెలిపారు. 

బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం భారతదేశాన్ని మూడు వర్గాలుగా విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “హిందీ మాట్లాడే రాష్ట్రాలు, హిందీ వాడకం తక్కువగా ఉన్న రాష్ట్రాలు, హిందీ మాట్లాడని రాష్ట్రాలుగా విభ‌జించాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. . తమిళనాడు మూడో కేటగిరీ కిందకు వస్తుంది. కానీ పురాతన భాషలలో ఒకటైన (తమిళం), సంస్కృతికి నిజమైన యజమానులుగా, మమ్మల్ని మూడవ తరగతి పౌరులుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలి'' అని స్టాలిన్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios