బ్యాంక్ జాబ్ వదిలేసి మరీ రైతయ్యాడు.. వేల మందికి ఉపాధి.. కోట్ల సంపాదన
మంచి జీతమొచ్చే బ్యాంక్ జాబ్ ను వదిలేయడమేంటి? రైతు అవ్వడమేంటి? ఇలా నమ్మే కథలా లేదు కదా? కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఈ కథ ఎందరికో స్ఫూర్తిదాయకం..
ఒక్క బ్యాంక్ జాబొస్తే చాలానుకునేవారు ప్రస్తుత కాలంలో చాలా మందే ఉన్నారు. అంతెందుకు బ్యాంక్ జాబ్ కోసం ఏండ్లు కష్టపడిపోతుంటారు. వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక ఏ పని అవసరం లేదనుకుంటారు. ఎందుకంటే ఈ జాబ్స్ లో మంచి ఆదాయం వస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం బ్యాంక్ జాబ్ నే వదిలేసి రైతుగా మారిపోయాడు. వినడానికి నమ్మశక్యంగా అనిపించడం లేదా? కానీ ఇది నిజం. రైతుగా మారడమే కాదు వేల మందికి ఉపాధి కల్పిస్తూ.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇతకీ అతనెవరు? అతని సక్సెస్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలాంటి కథను నమ్మడం కాస్త కష్టమే. ఎందుకంటే మన చుట్టూ ఎంతో మంది వ్యవసాయం చేసేవారున్నారు. కానీ వీరు కోట్లు సంపాదించిన దాఖలాలు ఉండవు. ఎందుకంటే వ్యవసాయంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ వస్తాయన్న ముచ్చట చాలా మందికి తెలుసు. కానీ ఓ వ్యక్తి మాత్రం వ్యవసాయంలోకి ప్రవేశించి కోట్ల రూపాయల స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించాడు. అతని పేరు అమిత్ కిషన్.
అమిత్ షా కిషన్ ఎనిమిదేండ్ల కాలంలో ఐసీఐసీఐ, బజాజ్, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి పలు బ్యాంకుల్లో పని చేశాడు. కానీ ఆ ఉద్యోగాన్ని వదిలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అతని తాతే తనకు ఆదర్శమట. అతని తాతలా రైతు కావాలని ఎప్పటి నుంచో అనుకునేవాడట అమిత్ కిషన్.
బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నప్పుడు క్యాన్సర్ కారణంగా తమ క్లయింట్లలో ఒకరిని కోల్పోయిన తర్వాత ఈ కార్పొరేట్ ప్రపంచాన్ని విడిచిపెట్టాలని అమిత్ కిషన్ నిర్ణయించుకున్నాడు. వారి తాత బాటలో నడవాలని అనుకున్నాడు. అయితే అమిత్ కిషన్ దగ్గర ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. అయితే ఏడాదిన్న కాలంలోనే అతను క్యాన్సర్ తో చనిపోయాడు. కుటుంబానికి అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ చేశాడు. అమిత్ దీన్ని చూసి మనం ఎలా జీవిస్తున్నాం? ఎలాంటి ఆహారం తింటున్నాం? ఇలాంటి రోగాలు రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఆలోచించాడట. ఆ ఘటన ఆయన్ను మరింత మెరుగ్గా చేయడానికి ప్రేరేపించిందని అతను ఒక నివేదికలో పేర్కొన్నాడు.
రైతుగా తన ప్రస్థానం
సేంద్రియ వ్యవసాయం, ఆరోగ్యకరమైన స్థిరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి అతను 2019 లో తన సోదరుడితో కలిసి హెబ్బేవు ఫామ్స్ ను స్థాపించాడు. ఎప్పుడు, ఏం పండించాలో ఆ సమయంలో వాళ్లకు తెలియదు. చుట్టుపక్కల పొలాల్లో రైతులు మిరప పంట సాగు చేస్తే వారు వేరుశనగ పండించేవాళ్లు. ఖరీఫ్, రబీ సీజన్ల గురించి వాళ్లకు ఏ మాత్రం తెలియదట. దీనివల్ల వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అవరోధాలు, సవాళ్లు
రసాయనాలు, ఎరువులను విచ్చలవిడిగా వాడే ఈ కాలంలో సేంద్రియ పద్ధతిలో పంటలను పండించడం నిజంగా సవాలుతో కూడుకున్నది. ఎరువులు, రసాయనాల వల్ల నేల సహజ సామర్థ్యాలు తగ్గుతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గుతుంది. కాగా చుట్టుపక్కల పొలాల్లోని రైతులంతా రసాయనాలు ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. అమిత్ మాత్రం రసాయనాలు లేకుండా పంటలను పండించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతన్ని చుట్టుపక్కల వారు తెలివితక్కువ వాడిలా చూశారట. అంతేకాదు ఆయన్నుచూసి ఎంతో మంది నవ్వుకున్నారు. చుట్టు పక్కల పొలం వారు పంటలకు రసాయనాలను పిచికారీ చేసినప్పుడు వారి పొలంలో ఉన్న కీటకాలు అమిత్ పొలంలోకి వచ్చేవి. ఆరోగ్యంగా బతకడం కోసం వారికి సహజసిద్ధమైన, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశానని అమిత్ చెప్పుకొచ్చు.
అయితే పంటను మరింత మెరుగ్గా పండించేందుకు అమిత్, అతని సోదరుడు 4 అడుగుల లోతు వరకు భూమిని దున్నడం, ఆవు పేడ, గోమూత్రం, అరటిపండ్లతో రసాయన ఎరువులను ఉపయోగించడం వంటి పద్దతులను అవలంభించారు. ఇది వారి ఉత్పత్తిని పెంచడానికి ఎంతో సహాయపడింది. ఈ పద్దతుల వల్ల వారి పొలంలో వానపాములను చూశారట. మీకు తెలుసా? ఈ వానపాములు వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాల కారణంగా అంతరించిపోతున్నాయి. ఇకపోతే అమిత్ ఎన్నిఅవరోధాలు ఎదురైనా మంచి పంటలను సాగుచేస్తున్నారు. అంతేకాదు ఇతను తన పొలంలో ప్రస్తుతం గిర్, సాహివాల్, జాఫరాబాదీతో సహా దాదాపు 700 దేశవాళీ ఆవులు, గేదెలను పెంచుతున్నాడు.
ఇతను వ్యవసాయానికి సోలార్ విద్యుత్ ను ఉపయోగిస్తాడు. అందుకే వీరి నెలవారీ కరెంటు ఖర్చు రూ.3 లక్షల నుంచి రూ.40 వేలకు తగ్గింది. అమిత్ రూ. 1.5 కోట్ల రుణం, 15 ఎకరాల పొలంతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇక ప్రస్తుతం వీరి పొలం 650 ఎకరాలకు విస్తరించింది. ఇక ఇతని వార్షిక లాభం రూ. 21 కోట్లు. ఇతను 3000 లకు పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు. బెంగుళూరు వంటి ఎన్నో నగరాల్లో ఇతని హెబ్బేవు ఉత్పత్తులు చాలా ఫేమస్.