మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, ముంబైలో ముగ్గురు మృతి

heavy rains in mumbai
Highlights

ఇవాళ కూడా భారీ వర్ష సూచన...

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ముంబైలో భారీగా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అలాగే ఈ వర్షపు నీటి  తాకిడిలో ముంబైలో పలు చోట్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

నైరుతి రుతుపవనాల ప్రారంభంలో మహారాష్ట్ర తో పాటు కర్ణాటకలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కానీ మద్యలో కాస్త మందగించిన రుతుపవనాలు గత రెండు రోజులు క్రితం మళ్లీ విజృంభించాయి. దీంతో గత రెండు రోజుల నుండి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల వల్ల ముంబై  లోని సియాన్, థానే, చెంబూర్ ప్రాంతాల్లోని లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్కడి ప్రజలను మున్సిపల్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం అందిస్తున్నారు.

ఇక ఈ వర్షాల కారణంగా ముంబైలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ముంబై నగరంలో ఒకరు, శివారు ప్రాంతమైన థానే మరో ఇద్దరు చనిపోయారు. అలాగే పలు ప్రాంతాల్లో ఈ వరద నీటివల్ల భారీ నష్టం సంభవించిందని మున్సిపల్ అధికారులు తెలిపారు. 

ఈ వర్షపు నీరు రైలు పట్టాలపై ప్రవహిస్తుండటంతో సెంట్రల్ రైల్వేకు చెందిన పలు రైళ్లు రద్దవగా మరికిన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.  అలాగే రోడ్లపై, సబ్ వేలలో నీరు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గుతోంది. ఇవాళ ఉదయం ముంబైలోని పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంబించింది. 

నిన్న ఉదయం నుండి ఇవాళ ఉదయం వరకు ఒక్క ముంబై నగరంలోనే 231.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇవాళ కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  

 

loader