మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ నూపుర్ శర్మకు మద్దతుగా నిలబడ్డారు. ఓ మహిళపై కొందరు ద్వేషం చిమ్ముతుంటే.. లౌకికవాదులమని చెప్పుకనే వారు మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదని విమర్శించారు.
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నుంచి నూపుర్ శర్మ సస్పెన్షన్ కు గురయ్యారు. దేశ వ్యాప్తంగా ఓ వర్గం నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను హత్య చేస్తామని బెదిరింపులు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు పోలీసు స్టేషన్ లలో ఆమెపై కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మద్దతు ప్రకటించారు. క్షమాపణ చెప్పిన మహిళపై ద్వేషాన్ని ప్రదర్శించడంలో లౌకిక ఉదారవాదుల మౌనం చెవిటిదని అన్నారు.
బీజేపీ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తోంది - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
‘‘క్షమాపణ చెప్పిన మహిళకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్వేషం, మరణ బెదిరింపుల బాధాకరమైన ప్రదర్శనపై లౌకిక ఉదారవాదులు అని పిలువబడే వారు మౌనం వహించడం ఖచ్చితంగా చెవిటితనం! ’’ అని ఆయన తెలిపారు. #LetsTolerateIntolerance అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపగించి ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
విపక్షాలు, పలు ఇస్లామిక్ దేశాల నుంచి భారీ ఎదురుదెబ్బలు తగలడంతో బీజేపీ గత వారం నూపుర్ శర్మను సస్పెండ్ చేసింది. ఢిల్లీ యూనిట్ మీడియా హెడ్ నవీన్ జిందాల్ ను బహిష్కరించింది. అరబ్ కంట్రీస్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో నూపుర్ శర్మ తన వివాదాస్పద ప్రకటనను ఉపసంహరించుకున్నారు. తమ దైవం శివుడిపై నిరంతరం అవమానాలు చేస్తూ, అగౌరవ పరిచేలా వస్తున్న వ్యాఖ్యలను భరించలేకనే తాను ఆ విధంగా మాట్లాడానని ఆమె పేర్కొన్నారు. అంతే గానీ తనకు ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదని అన్నారు. అయినప్పటికీ ఆమెకు ఇంకా మరణ బెదిరింపులు వస్తున్నాయి.
Prophet Row : యూపీలోని ఘజియాబాద్ లో 144 సెక్షన్ విధింపు.. ఆగస్టు 10 వరకు కొనసాగింపు
కాగా.. సస్పెన్షన్ కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను అరెస్టు చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ అంశంపై ఎవరూ హింసను ఆశ్రయించరాదని లేదా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన నొక్కి చెప్పారు, కానీ టీవీ చర్చలో ఆమె వ్యాఖ్యలు నిప్పులు చెరిగిన తరువాత శర్మపై వెంటనే చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలమైందని ఆయన విమర్శించారు.
జ్ఞాన్ వ్యాపి మసీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధఙ నూపుర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల అరాధ్యుడైన మహ్మద్ ప్రవక్తపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయాగ్ రాజ్ తో పాటు మరి కొన్ని పట్ణణాల్లో ఆందోళనలు జరిగాయి. గత శుక్రవారం కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లోని హౌరా చేపట్టిన నిరసనలు కూడా హింసాత్మకంగా మారాయి. కాగా దేశంలో నూపుర్ శర్మను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నట్టుగానే.. ఆమెకు మద్దతుగా కూడా ర్యాలీలు తీస్తున్నారు.
