బీజేపీ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో స్థానాలు తగ్గినప్పటికీ తమ పార్టీ ఇంకా జాతీయ పార్టీగానే ఉందని ఆయన గుర్తు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తోందని ఆరోపించారు. మహమ్మద్ ప్రవక్తపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇటీవలి హింసపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికలు, ఫలితాల విషయాన్నిప్రస్తావిస్తూ.. ఎగువ సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లో సంక్షోభం సృష్టించి గుర్రపు వ్యాపారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు.
‘‘ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల విషయంలో రాజీపడబోదు. బీజేపీ మతం ఆధారంగా ప్రజలను విభజిస్తోంది. పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా అల్లర్లను రెచ్చగొడుతోంది’’ అని సీఎం ఆరోపించారు. పార్లమెంటులో సంఖ్య తగ్గినా మేం ఇప్పటికీ జాతీయ పార్టీగానే ఉన్నామని ఆయన చెప్పారు. రాజస్థాన్‌లో రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం విషయంలో మాట్లాడుతూ.. తమ పార్టీ నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుందని తెలిపారు. తమ పార్టీ బీజేపీని తుంగలో తొక్కడం ఇది మూడో సారి. వచ్చే 15 ఏళ్లలో ఇది చాలా సార్లు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Prophet Row : యూపీలోని ఘజియాబాద్ లో 144 సెక్షన్ విధింపు.. ఆగస్టు 10 వరకు కొనసాగింపు
‘‘NDA ప్రభుత్వం, ప్రధాని టార్గెట్ రాజస్థాన్, దాని సీఎం. వారు సంక్షోభాన్ని ప్రేరేపించి.. గుర్రపు వ్యాపారం చేయడానికి ప్రయత్నించారు ’’ అని ఆరోపించారు. కాగా శుక్రవారం రాజస్థాన్ రాష్ట్రం పరిధిలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇందులో అధికార కాంగ్రెస్ మూడు, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి అనుకూలంగా క్రాస్ ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యే శోభారాణి కుష్వాను పార్టీ సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ విడతలో నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ జోరు కనబర్చింది. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఇందులో మూడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అలాగే ఒడిశాలో ఒక స్థానంలో విజయం సాధించింది. ఇదే రాష్ట్రంలో బీజేపీ మద్దతు ఇచ్చిన మరో స్వతంత్ర అభ్యర్థి కూడా గెలిచారు. ఇక కర్ణాటకలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా.. బీజేపీ మూడు చోట్ల నుంచి పోటీ చేసింది. ఆ మూడు స్థానాలను కూడా గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా ముగ్గురు అభ్యర్థులను పోటీలో ఉంచగా.. అందులో ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. కాగా ఈ విడతలో మొత్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావించింది. ఈ మేరకు గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
