ఎఫ్ఐఆర్‌లో వ్యక్తి మతాన్ని ప్రస్తావించిన పోలీసులు.. హైకోర్టు ఆగ్రహం
హర్యానా పోలీసులు ఓ ఎఫ్ఐఆర్‌లో వ్యక్తి మతాన్ని చేర్చారు. దీనిపై పంజాబ్ హర్యానా హైకోర్టు ఆగ్రహించింది. ఇది తీవ్రమైన అంశం అని, దీనిపై తీసుకున్న దిద్దుబాటు చర్యలతో ఈ నెల 18వ తేదీ లోపు హర్యానా డీజీపీ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా హైకోర్టు హర్యానా పోలీసుల నిర్వాకంపై మండిపడింది. ఎఫ్ఐఆర్‌లో ఓ వ్యక్తి మతాన్ని పోలీసులు మెన్షన్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. సెప్టెంబర్ 18 కల్లా ఈ విషయంలో తీసుకున్న దిద్దుబాటు చర్యలకు సంబంధించి అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. డబ్బుల వ్యవహారంలో గొడవకు సంబంధించిన పిటిషన్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు విచారిస్తున్నది.
ఇదే సందర్భంలో జస్టిస్ జస్‌గుర్‌ప్రీత్ సింగ్ పురి పంజాబ్‌లో జరిగిన ఇలాంటి ఘటననే ప్రస్తావించారు. ఆ చర్యను తప్పుపట్టగానే పంజాబ్ డీజీపీ పోలీసులకు ఎఫ్ఐఆర్‌లో వ్యక్తుల మతాలను ప్రస్తావించరాదని సూచనలు చేశారని గుర్తు చేశారు.
హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో వాడిన భాషను హైకోర్టు గుర్తు చేసింది. జస్టిస్ పురి మాట్లాడుతూ.. ఈ ఎఫ్ఐఆర్‌లో వ్యక్తి మతాన్ని రాశారని తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయం అని పేర్కొన్నారు. ఇలాంటిదే పంజాబ్‌లోనూ జరిగిందని గుర్తు చేశారు.
ఎఫ్ఐఆర్ లేదా ఇతర ఏ పోలీసు ప్రొసీడింగ్స్‌లోనైనా వ్యక్తి కులాన్ని చేర్చరాదని ఈ కోర్టు ఇది వరకే స్పష్టంగా తెలిపిందని హైకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్ కంటే ముందు పంజాబ్ నుంచి ఓ కేసు వచ్చింది. అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు 07.03.2022నాడు పంజాబ్ డీజీపీ తరఫున అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అఫిడవిట్ సమర్పించారని వివరించింది. ఇక పై ఎఫ్ఐఆర్‌లో ఎప్పుడూ మతం ప్రస్తావించబోమని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలిపింది.
Also Read: కమ్యూనిస్టులు గాంధీ భవన్‌కు రావడం మళ్లీ ఇప్పుడే.. : కాంగ్రెస్‌కు తన సారథ్యంపై రేవంత్ రెడ్డి
హర్యానా డీజీపీ కూడా సెప్టెంబర్ 18వ తేదీ లోపు ఈ కేసులో తీసుకున్న దిద్దుబాటు చర్యలతో ఓ అఫిడవిట్‌ను సమర్పించాలని జస్టిస్ పురి ఆదేశించారు.