న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యానిర్వహక బోర్డు చైర్మెన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నియమితులయ్యారు.ఈ నెల 22వ తేదీన హర్షవర్ధన్ ఈ బాద్యతలను చేపట్టనున్నారు. 

34 మంది సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యానిర్వాహక బోర్డు ఛైర్మెన్ గా ప్రస్తుతం జపాన్ కు చెందిన హిరొకి నకటానికి ఉన్నారు. నకటాని పదవీకాలం ముగియడంతో హర్షవర్ధన్ ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు. డబ్ల్యుహెచ్ఓ విధానపరమైన నిర్ణయాల్లో కార్యానిర్వహక బోర్డు కీలక పాత్ర పోషించనుంది.

also read:యూపీలో రెండు ట్రక్కులు ఢీ: ఆరుగురు రైతుల మృతి

కార్యానిర్వాహక బోర్డు చైర్మెన్ పదవికి భారత్ ప్రతినిధిని నియమించే ప్రతిపాదనకు డబ్ల్యుహెచ్ఓలోని 194 దేశాల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ విషయమై డబ్లుహెచ్ఓ అసెంబ్లీ ఆమోదం తెలిపినట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యానిర్వాహక బోర్డు చైర్మెన్ పదవికి భారత్ ను నామినేట్ చేస్తూ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య గత ఏడాది ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. చైనాకు డైరెక్టర్ జనరల్ అంటకాగుతున్నారని సోమవారం నాడు ట్రంప్ ఓ లేఖను రాశారు. ఈ లేఖను ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.