దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ కెనడాకు బిగ్ రిలీఫ్.. ‘‘ఈ -వీసా’’ సేవలను పునరుద్ధరించిన భారత్

దాదాపు రెండు నెలల విరామం తర్వాత కెనడియన్ పౌరుల కోసం భారత్ .. ఎలక్ట్రానిక్ వీసా సేవలను (ఈ వీసా) తిరిగి ప్రారంభించినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు జాతీయ వార్తా సంస్థ ఎన్‌డీటీవీ నివేదించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది.

hardeep singh nijjar: India Resumes E-Visa Services For Canadians After 2-Month Pause: Sources ksp

దాదాపు రెండు నెలల విరామం తర్వాత కెనడియన్ పౌరుల కోసం భారత్ .. ఎలక్ట్రానిక్ వీసా సేవలను (ఈ వీసా) తిరిగి ప్రారంభించినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు జాతీయ వార్తా సంస్థ ఎన్‌డీటీవీ నివేదించింది. ఆ దేశ పౌరసత్వం వున్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది. ట్రూడో వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం సెప్టెంబర్ 21న వీసా సేవలను నిలిపివేసింది. తదుపరి నోటీసు వరకు ఈ నిర్ణయం అమల్లో వుంటుందని తెలిపింది. 

ప్రస్తుతం భారత్ నిర్ణయంతో టూరిస్ట్ వీసాలతో సహా అన్ని వీసా సేవలు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. వ్యాపార, వైద్య, విద్య తదితర వీసా సేవలను గత నెలలోనే భారత్ పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించడం, అలాగే దౌత్యవేత్తల సంఖ్యలో భారత్ ‘‘సమానత్వం’’ అన్న రూల్ తీసుకురావడంతో న్యూఢిల్లీలోని కెనడా హైకమీషన్‌లో వున్న అదనపు దౌత్యవేత్తలు, సిబ్బంది తమ దేశానికి వెళ్లిపోయారు. దీనికి అదనంగా ఇరుదేశాలు ట్రావెల్ అడ్వజైరీలను సైతం జారీ చేశాయి. కెనడాలోని తమ పౌరులకు భారత్ హెచ్చరికలు  జారీ చేయగా.. భారతదేశంలోని కెనడియన్లు అప్రమత్తంగా వుండాలని ఆ దేశ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. 

నిజ్జర్ హత్య వెనుక తమ ప్రమేయం వుందంటూ కెనడా చేస్తోన్న అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను భారత ప్రభుత్వం పదే పదే ఖండించింది. ఒట్టావా తన వాదనలకు మద్ధతుగా సాక్ష్యాలను చూపాలని న్యూఢిల్లీ డిమాండ్ చేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాము కెనడా దర్యాప్తును తోసిపుచ్చడం లేదని, కానీ ఆరోపణలను సాక్ష్యాధారాలతో సహా పంచుకోవాలని పేర్కొన్నారు. 

ఇక భారత్ - కెనడాల మధ్య ఈ స్థాయిలో ఉద్రిక్తతలకు కారణమైన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ఈ ఏడాది జూన్‌లో వాంకోవర్‌లోని గురుద్వారా వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. నిజ్జర్‌ను భారత ప్రభుత్వం 2020లో అధికారికంగా నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios