వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు .. ఇదే వేగాన్ని కొనసాగిద్దాం: ప్రధాని మోడీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మన దేశంలోనూ నమోదుకావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశామని అధికారులు చేబుతున్నారు. కరోనా టీకాలు వేయడంలో భారత్ మరో ఘనత సాధించింది. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ ఇదే వేగాన్ని కొనసాగించాలని అన్నారు.
కరోనా వైరస్ వెలుగుచూసిన ఏడాదిన్నర దాటిపోయిన దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ పలు మార్పులకు లోనవుతూ అత్యంత ప్రమాదకారిగా మారుతున్నదని సైంటిస్టులు హెచ్చిరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను ప్రజలందరికీ అందించాలని సూచిస్తున్నారు. భారత్‌లోనూ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరింత వేగాన్ని పెంచినట్టు అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నాటికి కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ మరో ఘనత సాధించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టీకాలు తీసుకోవడానికి అర్హులైన దేశ జనాభాలో 50 శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు (రెండు డోసుల వ్యాక్సిన్) ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాటికే భారత్ లక్ష్యాన్ని చేరుకుందని పేర్కొంది.
Also Read: నాగాలాండ్ ఘటనపై నేడు పార్లమెంట్‌లో అమిత్ షా ప్రకటన
దేశవ్యాప్తంగా ఆదివారం నాటికి మొత్తం 127 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో మొదటి డోసు తీసుకున్నవారు 80 కోట్ల మంది ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు 47.9 కోట్ల మంది మంది ఉన్నారు. ప్రస్తుతం రెండు డోసులు తీసుకున్నవారు ఆర్హులైన వారిలో సగం మంది ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులైన వారిలో సగం మందికి రెండు డోసులు వ్యాక్సిన్ ఇచ్చి మరో మైలురాయికి భారత్ చేరుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘భారత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయిని అందుకుంది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇదే వేగంగా ముందుకు వెళ్లడం అత్యంత ముఖ్యమైనది. దీనికి సానుకూలంగా ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం కీలకం. అలాగే, కరోనా నిబంధనలు సైతం పాటించండి’ అంటూ ట్వీట్ చేశారు.
Also Read: భారత్‌లో 8,306 కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్..
అంతకు ముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ సాధించిన ఈ ఘనత గురించిన వివరాలు వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలనీ, అర్హులైన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పేర్కొంది. ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్ నేపథ్యంలో కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి. అలాగే, వ్యాక్సిన్ తీసుకోవడాన్ని సైతం తప్పనిసరి చేస్తున్నాయి. పుదుచ్చేరి ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. టీకా తీసుకోనివారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మాస్కులు, కరోనా నిబంధనలు పాటించని వారిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రిమానాలు సైతం విధిస్తున్నాయి.
Also Read: భారత్-రష్యా మధ్య 21వ శిఖరాగ్ర సదస్సు.. కీలక ఒప్పందాలపై సంతకాలు