Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ ఎన్నికల ఫలితాలు.. ఆప్ ఇక జాతీయ పార్టీ - ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పది స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే తాము విజయం సాధించకపోయినా.. ఈ ఫలితాలు ఆప్ ను జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు దోహదపడ్డాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. 

 

Gujarat election results.. AAP is now a national party - Delhi Deputy CM Manish Sisodia
Author
First Published Dec 8, 2022, 1:58 PM IST

గుజరాత్ ను తమ ఖాతాలో వేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు నీరుగారాయి. కాషాయ పార్టీకి కంచుకోటగా ఉన్న గుజరాత్ లో ఈ సారి కూడా బీజేపీనే అధికారం చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగానే మారిపోనుంది. అయితే ఈ రెండు పార్టీలకు ధీటుగా పోటీ పడుతుందని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండంకెల స్థానాన్ని కూడా దాటే అవకాశం కనిపించడం లేదు. కానీ తాజా ఫలితాల వల్ల ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి ఆరాటపడుతోంది. 

హిమాచల్‌‌లో బీజేపీ ప్రణాళికలు సక్సెస్ కాలేదా?.. ఓటర్లు ఎప్పటిలాగే తీర్పు ఇచ్చేశారా..!

గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించబోతోందని ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ కంటే ఆప్ చాలా వెనుకబడి ఉన్నప్పటికీ పూర్తి ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి 2 సీట్లు గెలుపొందినా కూడా అది జాతీయ పార్టీ హోదాను పొందుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో 6 శాతం ఓట్లను పార్టీ సాధించాల్సి ఉంటుంది.

2024లో కేజ్రీవాల్‌ దారెటు ? 
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. కానీ ఢిల్లీలో ఒక్క లోక్ సభ స్థానాన్ని సాధించలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో పంజాబ్‌లో కూడా కేవలం ఒకే లోక్ సభ సీటుకే పరిమితమైంది. ఢిల్లీ, పంజాబ్ తరహాలోనే అత్యద్భుత ప్రదర్శనను ఆశించి ఆప్‌ బరిలోకి దిగింది. అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ప్రతిపక్షంలో కూర్చుంటుంది అనుకునేంత హైప్ క్రియేట్ చేసింది. కానీ అనుకున్నంత మేర విజయం సాధించలేకపోయింది. 

32 ఏళ్లుగా అధికారానికి కాంగ్రెస్ దూరం: గుజరాత్‌లో ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం

కానీ ఈ ఎన్నికల వల్ల తమది కూడా ఒక జాతీయ పార్టీ అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకునే అవకాశం లభించింది. దీని వల్ల భవిష్యత్ లో ఆయన ఎలాంటి అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీగా ఆప్ లోక్ సభ బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. కాగా.. భారతదేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి. కానీ 2014 నుంచి కాంగ్రెస్ ప్రభావం తగ్గుతున్నప్పటికీ ఏ ఇతర పార్టీ కూడా బీజేపీని ధీటుగా ఎదుర్కొలేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా ఉన్నంత నెటవర్క్ లేదు. కాబట్టి ఒక వేళ ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందినా.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం ఇప్పటికైతే కష్టంగానే కనిపిస్తోంది. 

దేశంలోని జాతీయ పార్టీలేవి ? 
మన దేశంలో భారత ఎన్నికల సంఘం గుర్తించిన ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి. అందులో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్ సీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ఫీపీ), నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లు ఉన్నాయి. 

జాతీయ పార్టీ అంటే ఏమిటి?
భారత ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల ప్రకారం.. ఒక పార్టీ జాతీయ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ‘రాష్ట్ర పార్టీ’ హోదా పొందాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్రపార్టీ హోదా పొందాలంటే ఓ పార్టీ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లను పొందాలి. లేకపోతే రెండు స్థానాలను గెలుచుకోవాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios