గుజరాత్ లోని జునాఘడ్ లో శుక్రవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్రమణల తొలగింపులో భాగంగా దర్గా కూల్చేందుకు అధికారులు ప్రయత్నించడంతో పలువురు ఆందోళనకు దిగారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అయితే ఓ రాయి తగిలి పౌరుడు మరణించాడు. 

ఆక్రమణల తొలగింపులో భాగంగా దర్గాను కూల్చివేసేందుకు గుజరాత్ లోని జునాగఢ్ నగరపాలక సంస్థ ప్రయత్నించింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ నగరంలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో రాయి తగలడంతో ఒకరు మరణించారు. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. నగరంలోని మజేవాది దర్వాజ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగిందని, ఈ సందర్భంగా పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి ఆందోళనకారులపై లాఠీచార్జి చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితిపై తక్షణం దృష్టి పెట్టాలి - ఆర్మీ మాజీ చీఫ్ వేద్ ప్రకాశ్ మాలిక్

‘‘జూన్ 14న జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్.. మాజెవాడి దర్వాజ సమీపంలోని ఓ మసీదుకు భూమి యాజమాన్యానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుపై ఆగ్రహించిన సుమారు 500-600 మంది శుక్రవారం రాత్రి మతపరమైన భవనం సమీపంలో గుమిగూడి రహదారులను దిగ్బంధించారు’’ అని ఎస్పీ రవితేజ వాసంశెట్టి తెలిపారు. 

Scroll to load tweet…

సంఘటనా స్థలంలో ఉన్న జునాగఢ్ డిప్యూటీ ఎస్పీ, ఇతర సిబ్బంది వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని, ఆందోళనకారుల రోడ్డు దిగ్బంధాన్ని తొలగించాలనే లక్ష్యంతో దాదాపు గంటపాటు చర్చించారు. అయితే రాత్రి 10.15 గంటల సమయంలో పోలీసు సిబ్బందిపై నిరసనకారులు రాళ్లు విసిరారు. నినాదాలు చేశారు. దర్గాకు నోటీసు ఇవ్వడంపై ఆందోళనకు దిగిన కొందరు పోలీసులపై దాడికి యత్నించారు. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, లాఠీఛార్జ్ చేశారు. 

ఒడిశా సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లో దారుణం.. ఫారెస్ట్ ఆఫీసర్ ను కాల్చి చంపిన వేటగాళ్లు..

ఈ ఘటనలో జునాగఢ్ డీఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, అయితే వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, ఒక గుంపు ఒక వాహనానికి కూడా నిప్పు పెట్టిందని ఎస్పీ రవితేజ అన్నారు. ‘‘ ఈ ఘటనలో ఓ పౌరుడు చనిపోయాడు. అతడి మరణానికి రాళ్లు రువ్వడమే కారణమని తెలుస్తోంది. కానీ కచ్చితమైన కారణం తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. పోలీసు బృందాలు కూంబింగ్ ఆపరేషన్ లో 174 మందిని అదుపులోకి తీసుకున్నాయి’’ అని వాసంశెట్టి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను రంగంలోకి దించామని, ఘర్షణకు పాల్పడిన వారందరినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.