Rahul Gandhi: హైదరాబాద్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, పౌర హక్కుల కార్యకర్త జీ.హరగోపాల్ తెలంగాణ‌లోని కొన‌సాగుతున్న భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీతో క‌లిసిముందుకు న‌డిచారు. దేశంలోనే ఆర్థికంగా వెనుకబడిన జిల్లాల్లో మహబూబ్‌నగర్‌ ఒకటనీ, పెద్దఎత్తున వలసలు చోటుచేసుకుంటూనే ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్‌ నేతలతో అన్నారు. 

Congress Bharat Jodo Yatra: కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షులు, వ‌య‌నాడ్ పార్లమెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. దీనికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ప్రస్తుతం రాహుల్ పాద‌యాత్ర తెలంగాణ‌లోని మహబూబ్‌నగర్ పట్టణంలో కొన‌సాగుతోంది. శ‌నివారం పాద‌యాత్ర‌లో భాగంగా ఏర్పాటు చేసిన స‌మావేశానికి పెద్ద‌సంఖ్య‌లో కాంగ్రెస్ శ్రేణులు, ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలో వైర‌ల్ గా మారాయి. వారిని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆరోగ్యం, విద్య పై మ‌రింత దృష్టి సారించాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలను పూర్తిగా ప్ర‌యివేటు రంగాల‌కు అప్ప‌గించ‌కుండా ప్రభుత్వ జోక్యం మ‌రింత‌గా పెంచుతూ.. ఈ రంగాల అభివృద్దికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. వివిధ వర్గాల ప్రతినిధులతో ఆయన సంభాషిస్తూ, తెలంగాణలో ప్రత్యేకంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు.

“ఆరోగ్య సంరక్షణ, విద్య ప్రభుత్వ ప్రధాన బాధ్యత.. కేవలం ప్ర‌యివేటు సంస్థలకు మాత్రమే వదిలివేయకూడదు. సరిగ్గా చేస్తే, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రజలకు ఇది పెద్ద ఉపాధి అవకాశాలను సృష్టించగలదు” అని రాహుల్ గాంధీ చెప్పారు. విద్యార్ధులు చదువును కొనసాగించకుండా తక్కువ జీతానికి ఉద్యోగాలు చేయాల్సి రావడం విషాదకరమన్నారు. విద్యా, ఆరోగ్య రంగాలు ఎదుర్కొంటున్న ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఆయ‌న అన్నారు. ర్యాలీలో విద్యావేత్త, మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్ కన్వీనర్ ఆర్ వెంకట్ రెడ్డి గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ విద్యారంగంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చారు.“ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలకు నిధులను తగ్గించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం వల్ల తల్లిదండ్రులు పిల్లలను ప్ర‌యివేటు విద్యాసంస్థలకు పంపేలా చేస్తున్నారు” అని ఆయ‌న అన్నారు. ఆయా రంగాల్లో బడ్జెట్‌లో తెలంగాణ దేశంలోనే అత్యల్పంగా ఉందన్నారు.

మరో కార్యకర్త వర్షా భార్గవి మాట్లాడుతూ పెళ్లి చేసుకునే అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చే రాష్ట్ర పథకం వారి విద్యావకాశాలు క్షీణతకు దారితీస్తోందని అన్నారు. అమ్మాయి ఉన్నత చదువులు లేదా వివాహానికి వారు ఎంచుకున్న డబ్బును కుటుంబానికి ఉపయోగించుకునే అవకాశం రాష్ట్రం ఇవ్వాలని ఆమె సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రెండేళ్లు జాప్యం జరుగుతోందనీ, దీంతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువును కొనసాగించడం కష్టతరంగా మారిందని విద్యార్థిని దివ్య సాయి రాహుల్ గాంధీకి చెప్పారు. హైదరాబాద్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, పౌర హక్కుల కార్యకర్త జీ.హరగోపాల్ తెలంగాణ‌లోని కొన‌సాగుతున్న భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీతో క‌లిసిముందుకు న‌డిచారు. దేశంలోనే ఆర్థికంగా వెనుకబడిన జిల్లాల్లో మహబూబ్‌నగర్‌ ఒకటని, పెద్దఎత్తున వలసలు చోటుచేసుకుంటూనే ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్‌ నేతలతో అన్నారు.

“మహబూబ్‌నగర్‌ గుండా కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ, వ్యవసాయానికి నీటి కొరత తీవ్ర పేదరికం, వలసలకు దారి తీస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గతంలో హామీలు ఇచ్చినా నేటికీ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాతిపదికన పూర్తి చేసేలా చూస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. పెద్ద సంఖ్యలో గిరిజన కళాకారులు కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కోయ తెగకు చెందిన కళాకారులతో కలిసి రాహుల్ గాంధీ డాన్సు కూడా చేశారు.