ప్రస్తుతం కోవిడ్-19 (కరోనా వైరస్) పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. మనుషుల ప్రాణాలను తీయడంతో పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను కరోనా పెను ప్రమాదంలోకి నెట్టింది. ప్రధానంగా పౌల్ట్రీ రంగం దీని కారణంగా పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

చికెన్, గుడ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు చికెన్ తినడానికి జంకుతున్నారు. దీంతో భారత్‌లో చికెన్, గుడ్ల అమ్మకాలు దాదాపు 40 శాతం మేర పడిపోయాయి.

Also Read:ఆ రూమర్స్ నమ్మకండి.. మేము రోజూ చికెన్ తింటున్నాం... మంత్రి కేటీఆర్

అయితే ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఉత్తరప్రదేశ్ పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యులు వినూత్న ప్రయోగం చేశారు. కేవలం రూ.30కే అన్‌ లిమిటెడ్ చికెన్ మీల్స్‌ ఆఫర్‌ను పెట్టారు.  దీంతో పెద్ద ఎత్తున చికెన్ ప్రియులు అక్కడికి చేరుకుని.. పీకలదాకా ఆరగించారు.

దీనిపై పౌల్ట్రీ నిర్వాహకులు మాట్లాడుతూ.. చికెన్, గుడ్లు, మటన్, చేపలు తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందని కొందరు చేస్తున్న అసత్య ప్రచారం కారణంగా భారతీయ పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాలకు గురవుతుందన్నారు.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా చికెన్ ఫెస్ట్ పెట్టామని.. కొద్దిసేపటికే జనం నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. తాకిడి ఇంకా పెరగడంతో మూడు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందన్నారు. వెయ్యి కిలోల చికెన్ వండగా.. గంటల వ్యవధిలోనే మొత్తం ఖాళీ అయ్యిందని నిర్వాహకులు తెలిపారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: తగ్గిన చికెన్ అమ్మకాలు

కాగా కోవిడ్-19 వైరస్‌కు చికెన్, గుడ్లతో ఎలాంటి సంబంధం లేదని వైద్యులు బల్లగుద్ధి చెబుతున్నారు. చైనాలో వాతావరణ పరిస్ధితులతో పాటు సగం ఉడికించిన ఆహార పదార్ధాల కారణంగానే అక్కడ వైరస్ వ్యాపిస్తోందన్నారు.

మనదేశంలో వేసవి ప్రారంభమవుతుండటం, ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకోవడంతో పాటు ఆహార పదార్ధాలను 100 సెంటిగ్రేడ్ వరకు ఉడికించి తీసుకోవడంతో మనదగ్గర వైరస్ వ్యాప్తి చెందే పరిస్ధితి తేదని వైద్యులు చెబుతున్నారు.