మణిపూర్ కు సాయం చేయాలంటే ముందు తమకు అందరూ సహకరించాలని భద్రతా బలగాలు ఆ రాష్ట్ర మహిళలను కోరారు. తమ చర్యల్లో జోక్యం చేసుకోవడం హనికరమని పేర్కొంది.
హింసాత్మక ప్రభావిత మణిపూర్ లో భద్రతా దళాలు చేస్తున్న ఆపరేషన్లలో జోక్యం చేసుకోవద్దని, ఈశాన్య రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రజలు సహకరించాలని భారత సైన్యం మహిళా కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. భద్రతా దళాల చర్యల్లో అనవసరమైన జోక్యం హానికరమని పేర్కొంది. ఆర్మీకి చెందిన స్పియర్స్ కార్ప్స్ సోమవారం అర్థరాత్రి ఇటీవల జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది.
‘‘ఇంఫాల్ ఈస్ట్ లోని ఇథమ్ గ్రామంలో మహిళల నేతృత్వంలోని గుంపు చుట్టుముట్టడంతో 12 మంది మిలిటెంట్లను బలగాలు విడిచిపెట్టాయి. మహిళా కార్యకర్తలు కావాలనే మార్గాలను దిగ్బంధించి భద్రతా దళాల కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇలాంటి అనవసర జోక్యం వల్ల క్లిష్ట పరిస్థితులలో ప్రాణాలు, ఆస్తిని రక్షించడానికి భద్రతా దళాలు సకాలంలో స్పందించడానికి హానికరం.’’ అని పేర్కొంది. ‘‘శాంతిని పునరుద్ధరించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని భారత సైన్యం అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. మణిపూర్ కు సాయం చేయండి’’ అని ట్వీట్ చేసింది.
ఇటీవల ఇథామ్ లో మహిళల నేతృత్వంలోని పెద్ద గుంపు భద్రతా బలగాలను చుట్టుముట్టింది. ఆ సమయంలో బలప్రయోగం చేయడం వల్ల జరిగే సున్నిత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఆర్మీ పరిణతి చెందిన నిర్ణయం తీసుకొంది. మిలిటెంట్లను విడిచిపెట్టింది. ఈ ప్రతిష్టంభన శనివారం అంతటా కొనసాగింది. ఇలాంటి చర్య వల్ల ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
2015లో 6 డోగ్రా యూనిట్ పై దాడి సహా పలు దాడుల్లో పాల్గొన్న మెయిటీ మిలిటెంట్ గ్రూప్ కాంగ్లీ యావోల్ కన్నా లూప్ (కేవైకేఎల్)కు చెందిన 12 మంది సభ్యులు ఇథామ్ గ్రామంలో తలదాచుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని విడిపించడానికి మహిళల గుంపు ఈ విధంగా ప్రవర్తించింది. దీంతో ఆర్మీ వెనక్కి తగ్గింది. ఆ మిలిటెంట్ల నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రితో భద్రతా సిబ్బంది వెళ్లిపోయారు.
మణిపూర్ అల్లర్లలో 100 మందికి పైగా మృతి
ఈశాన్య రాష్ట్రంలో మెయిటీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మీటీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా మే 3న కొండ జిల్లాల్లో 'ట్రైబల్ సాలిడారిటీ మార్చ్' నిర్వహించిన తరువాత మొదట ఘర్షణలు చెలరేగాయి. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు- నాగాలు, కుకిలు - జనాభాలో మరో 40 శాతం మంది ఉన్నారు. వీరంతా కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.
