గోవాలో ఓ వ్యక్తి తన పై పోలీసులకు ఫిర్యాదు చేసిందని మరుసటి రోజు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు.
పనాజీ: గోవాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని పొరుగునే ఉండే మహారాష్ట్రలోని ఓ ఘాట్‌లో పడేశాడు. ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆమెను హత్య చేయడం గమనార్హం. ఈ ఘటన గోవాలోని పొర్వొరిమ్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 22 ఏళ్ల ప్రకాశ్ చుంచ్వాడ్‌కు 30 ఏళ్ల కామాక్షి నాయక్ అనే మహిళ గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేది. వారిద్దరూ కొన్ని కారణాలతో వేరుగా ఎవరి జీవితంలో వారు ఉన్నారు. కొన్నాళ్ల నుంచి చుంచ్వాడ్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. బుధవారం వారిద్దరికి గొడవ జరిగింది. ఆ తర్వాత కామాక్షి నాయక్ మాపుస పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చుంచ్వాడ్‌ను రప్పించి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఆమెను ఇబ్బంది పెట్టవద్దని మందలించి పంపించేశారు.
చుంచ్వాడ్ పోలీసు స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు కామాక్షి నాయక్‌ను ఏమీ అనలేదు. కానీ మరుసటి రోజు చుంచ్వాడ్ ఆమె ఇంటికి నేరుగా వెళ్లాడు. మళ్లీ గొడవ పెట్టుకుని కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఓ వెహికిల్‌లో ఆమెను అంబోలీ ఘాట్ వద్దకు తీసుకెళ్లి డెడ్ బాడీ అక్కడే పడేసి వచ్చాడు.
Also Read: జమిలి ఎన్నికలంటే ఏమిటీ? ఈ విధానంతో ప్రయోజనాలు, ప్రతికూలతలు ఏమున్నాయ్?
అయితే.. కామాక్షి నాయక్ బంధువులు ఇంటికి వస్తే ఆమె కనిపించలేదు. ఇంట్లో రక్తపు మరకలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. చుంచ్వాడ్‌ను ప్రశ్నించగా.. కామాక్షి నాయక్‌ను చంపేసినట్టు అంగీకరించాడు. పోలీసులు చుంచ్వాడ్‌ను అరెస్టు చేశారు. డెడ్ బాడీని డంప్ చేయడానికి వాడిన వెహికిల్‌ను కూడా సీజ్ చేశారు.
