టీనేజ్ అమ్మాయిలు లైంగిక కోరికలను అదుపులో పెట్టుకోవాలి.. : కలకత్తా హైకోర్టు
బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, రెండు నిమిషాల ఆనందానికి లొంగకూడదని కలకత్తా కోర్టు సూచించింది.
కోల్‌కతా : అత్యాచారం కేసులో పడిన శిక్షకు వ్యతిరేకంగా ఒక యువకుడు చేసిన అభ్యర్థనను విన్న కలకత్తా హైకోర్టు కౌమారదశలో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని.. ఎదుటి జెండర్ గౌరవం, శారీరక స్వయంప్రతిపత్తిని కూడా గౌరవించాలని కోరుతూ మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది. మైనర్ అయిన తన భాగస్వామితో సెక్స్‌లో పాల్గొన్నందుకు గత సంవత్సరం యువకుడికి సెషన్స్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
విచారణ సందర్భంగా, బాలిక తన ఇష్టప్రకారమే అతడితో శృంగారంలో పాల్గొన్నానని, ఆ తరువాత అతనిని వివాహం చేసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే, కోర్టు భారత్‌లో సెక్స్‌కు అంగీకరించే వయస్సు 18 ఏళ్లు అని, అంతకు తక్కువ వయసు ఉన్నవారితో సంబంధం నేరమని అన్నారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి శృంగారానికి సమ్మతించినా.. ఆమె అంగీకారం చెల్లుబాటుగా పరిగణించబడరని, వారితో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. అది లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం పోక్సో చట్టం కింద అత్యాచారం కిందికి వస్తుందన్నారు.
న్యాయమూర్తులు చిత్త రంజన్ దాష్, పార్థ సారథి సేన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సెషన్స్ కోర్టు తీర్పును పక్కన పెట్టింది. చిన్న వయస్సులో లైంగిక సంబంధాల వల్ల తలెత్తే చట్టపరమైన సమస్యలను నివారించడానికి పాఠశాలల్లో సమగ్ర లైంగిక విద్యను అందించాలని కోరింది. కౌమారదశలో ఉన్నవారిలో సెక్స్ కోరికలు సాధారణమైనవే. అయితే, అలాంటి కోరికలకు ఆ వయసులో ఎంతవరకు లొంగడం అనేది స్త్రీ, పురుషుల చర్యపై ఆధారపడి ఉంటుందని బెంచ్ పేర్కొంది.
బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, రెండు నిమిషాల ఆనందానికి లొంగకూడదని కోర్టు సూచించింది. "బాలికలు లైంగిక కోరికలు/ప్రేరేపణలపై నియంత్రణ కలిగి ఉండాలి. లేకపోతే, కేవలం రెండు నిమిషాల పాటు లైంగిక ఆనందాన్ని ఆస్వాదించడానికి లొంగిపోతే.. సమాజం దృష్టిలో ఓడిపోయినవారు అవుతారు" అని బెంచ్ తన తీర్పులో పేర్కొంది.
"తన శరీరాన్ని గౌరవించడం, తమ విలువలను కాపాడుకోవడం, ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడం యువతుల కర్తవ్యం’’ అని బెంచ్ పేర్కొంది. అబ్బాయిలు కూడా అమ్మాయిల గౌరవాన్ని ఒప్పుకోవాలని.. మహిళలను గౌరవించేలా ప్రవర్తించాలని అందులో పేర్కొంది.
"యువతి లేదా స్త్రీకి సంబంధించి పైన పేర్కొన్న విధులను గౌరవించడం కౌమారదశకు చెందిన మగవారి కర్తవ్యం. స్త్రీని, ఆమె గౌరవాన్ని, గోప్యతను, ఆమె శరీరం స్వయంప్రతిపత్తిని గౌరవించేలా తన మనస్సుకు శిక్షణ ఇవ్వాలి" అని కోర్టు చెప్పింది.