Hiranandani vs Mahua: పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు.. సంచలనం రేపుతున్న హీరానందనీ లెటర్
Darshan Hiranandani vs Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా త్వరగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారనీ, ప్రధాని మోడీని వ్యక్తిగతంగా విమర్శించడమే ప్రస్తుతం ఉన్నవాటిలో ఒక మార్గమని ఆమె స్నేహితులు, సలహాదారులు ఆమెకు సూచించారని ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ గురువారం తన లెటర్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన రాసిన లెటర్ సంచలనంగా మారింది.
New Delhi: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా త్వరగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారనీ, ప్రధాని మోడీని వ్యక్తిగతంగా విమర్శించడమే ప్రస్తుతం ఉన్నవాటిలో ఒక మార్గమని ఆమె స్నేహితులు, సలహాదారులు ఆమెకు సూచించారని ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ గురువారం తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన రాసిన లెటర్ సంచలనంగా మారింది.
వివరాల్లోకెళ్తే.. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ప్రశ్నలు అడిగేందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ.. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అందులు టీఎంసీ ఎంపీ పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘన, నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారనీ, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిని మహువా మొయిత్రా ఖండించారు. దీనిపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే సమయంలో తనపై ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన బీజేపీ నేత నిషికాంత్ దుబే తో పాటు ఓ న్యాయవాదికి లీగల్ నోటీసులు పంపారు.
అయితే, తాజాగా అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రశ్నలు గుప్పించడానికి మహువా డబ్బులు తీసుకున్నారని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ దాదాపు అంగీకరించారు. తాను సంతకం చేసిన అఫిడవిట్ లో కృష్ణానగర్ కు చెందిన టీఎంసీ ఎంపీ మహువాను మోడీ ప్రభుత్వానికి, అదానీ గ్రూపుకు ఇబ్బంది కలిగించే ప్రశ్నలను లేవనెత్తడానికి ఉపయోగించుకున్నానని హీరానందానీ అంగీకరించారు. మహువా మొయిత్రాతో తనకున్న పరిచయం, ప్రధాని మోడీని అప్రతిష్టపాలు చేసేందుకు వేసిన కుట్రను సంబంధిత విషయాలను దర్శన్ హీరానందానీ తన లెటర్ లో ప్రస్తావించారు.
దర్శన్ హీరానందానీ లెటర్ లో ఏం ప్రస్తావించారంటే..?
2017లో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరిగినప్పటి నుంచి మహువా మొయిత్రాతో తనకు పరిచయం ఉందని దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ తన లేఖలో పేర్కొన్నారు. ఆ సమయంలో మహువా మొయిత్రా ఎమ్మెల్యేగా ఉండి సదస్సుకు వచ్చే వ్యాపారవేత్తలను ఆహ్వానించి సమన్వయం చేసే బాధ్యత వహించారు. అప్పటి నుంచి తామిద్దరం నిరంతరం కలుస్తూ ఫోన్లో మాట్లాడుకుంటున్నామని దర్శన్ హీరానందానీ తెలిపారు. కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాలతో పాటు విదేశాల్లో చాలా సందర్భాలలో కలుసుకున్నామనీ, ఆమె దుబాయ్ వెళ్లినప్పుడల్లా ఇద్దరూ కలుసుకునేవారని తెలిపారు.
ప్రధాని మోడీని కించపరిచేలా..
మహువా మొయిత్రా లోక్ సభకు వెళ్లాలనుకున్నారనీ, రాజ్యసభకు వెళ్లేందుకు ఆమె రెండుసార్లు నిరాకరించారని పేర్కొన్నారు. ఎంపీ అయ్యాక కూడా వీరిద్దరూ పలుమార్లు కలుసుకున్నారు. మహువా మొయిత్రా ఎంతో ప్రత్యేకమనీ, త్వరలోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు దర్శన్ హీరానందానీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత దూషణ చేయడమే కీర్తికి సులువైన మార్గమని ఆయన స్నేహితులు, సలహాదారులు సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, మోడీ ప్రతిష్ట మచ్చలేనిది, విధానాలు, పాలన, వ్యక్తిగత ప్రవర్తనలో ఆయనపై దాడి చేయడానికి ఆయన ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే మోడీపై దాడి చేయడానికి ఉన్న అంశం అదానీ అనీ, ఎందుకంటే ఇద్దరూ గుజరాత్ కు చెందినవారుగా పేర్కొన్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంశం..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన కంపెనీల కంటే అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్ కంపెనీ ధమ్రా ఎల్ఎన్జీతో దీర్ఘకాలిక ఆఫ్-టేక్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇష్టపడుతోందని మహువా మొయిత్రాకు తెలుసని హీరానందానీ ఆరోపించారు. ఈ సమాచారం ఆధారంగా మొయిత్రా కొన్ని ప్రశ్నలు సంధించారు. అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుని తాను పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తానని చెప్పారు. ఎంపీగా తన ఈమెయిల్ ఐడీని తనతో పంచుకున్నారని పేర్కొన్నారు.