జమ్మూకశ్మీర్‌ సంకీర్ణప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒక్కసారిగా దేశంలోని రాజకీయవేత్తల చూపు కశ్మీర్‌పై పడింది.. బీజేపీ మనసు మార్చుకుంటుందా..? పీడీపీ కాంగ్రెస్‌తో జతకడుతుందా లేక ఎన్సీపీతో జతకడుతుందా..? ఇవన్నీ లేకపోతే.. రాష్ట్రపతి పాలన వస్తుందా..? అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు.

పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ చెప్పిన సమయంలో మీరు హిమాలయాలంత తప్పు చేస్తున్నారని మోడీతో అన్నానని.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నిజమయ్యాయని గులాంనబీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పరిణామాలు మంచివేనని.. పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి తెరపడటంతో జమ్మూకశ్మీర్ ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు.. సంకీర్ణ పాలనలో ఎంతోమంది పౌరులు, సైనికులు మరణించారని ఆజాద్ వివరించారు. ఈ కూటమి జమ్మూకశ్మీర్‌ను సామాజికంగా, ఆర్ధికంగా నాశనం చేసిందని మండిపడ్డారు. పీడీపీతో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు.