అధికార బీజేపీ దేశాన్ని అంధకారంలో నెట్టివేసిందని, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్టెంబరు 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైనప్పటికీ.. ఆ సెషన్ ఎజెండా ఏమిటో బీజేపీయే చెప్పలేకపోతుందని గౌరవ్ గొగోయ్ ఫైర్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే.. ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండాను కేంద్ర ప్రభుత్వం వెల్లడించకపోవడంతో కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేక సమావేశాలపై అధికార బీజేపీకే క్లారిటీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరుణంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ .. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించారు.
విలేకరుల సమావేశంలో గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. “ఈ రోజు సోనియా గాంధీ అధ్యక్షతన, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మా పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ సమావేశం జరిగింది. నేడు దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది." అని పేర్కొన్నారు.
సెప్టెంబరు 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి .కానీ ఆ సెషన్ ఎజెండా ఏమిటో బీజేపీయే చెప్పలేకపోతోందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దేశాన్ని అంధకారంలోకి నెట్టివేసిందనీ, ఈ ప్రభుత్వానికి దేశం పట్ల పారదర్శకత, బాధ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెషన్‌లో ఎజెండా ఏమిటనేది బీజేపీ స్పష్టం చేయలేకపోయిందనీ, దేశంలోని ముఖ్యమైన సమస్యలపై సభలో చర్చ జరగాలన్నదే తమ అభిప్రాయమని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి విపత్తు వంటి అంశాలపై చర్చించి సూచనలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. .
ముంబయిలో జరగనున్న ఇండియా సమావేశం నుంచి దృష్టి మరల్చేందుకే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చారని, 5 రోజుల పాటు తాము మోదీ చాలీసా వినబోమని ప్రస్తావిస్తూ బీజేపీపై మరింత విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్.
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి ముందుగా ఇవాళ ( మంగళవారం) కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరిగింది.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల గురించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం వెల్లడించారు. అయితే ప్రత్యేక సమావేశానికి సంబంధించిన ఎజెండా ఇంకా వెల్లడి కాలేదు. దేశంలో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలించి సిఫార్సులు చేసేందుకు కేంద్రం శనివారం ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
మాజీ రాష్ట్రపతి కోవింద్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు, గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలు కమిటీలోని సభ్యులుగా ఉన్నారు.
గత నెలలో ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో జరిగాయి. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక సమావేశాన్ని ప్రకటించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వానికి సహకరించేందుకు తమ పార్టీ సంసిద్ధతను సూచిస్తూ.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, దౌత్యపరమైన అంశాలతో కూడిన దేశం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లపై సమగ్రంగా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని జైరాం రమేష్ పేర్కొన్నారు.
