కెనడాలో ఆ ఖలిస్తానీ టెర్రరిస్టు హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్
కెనడాలో నిన్న రాత్రి గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఖలిస్తాన్ టెర్రరిస్టు మరణించాడు. 2017లో భారత్ నుంచి ఫేక్ పాస్‌పోర్టుపై కెనడాకు పారిపోయిన సుఖ్‌దూల్ సింగ్ మరణించాడు. సుఖ్‌దూల్ సింగ్ హత్యకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఓ ఫేస్‌బుక్ పోస్టు పెట్టింది.

న్యూఢిల్లీ: భారత్‌లో నిషేధమైన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సభ్యుడు, టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్, కెనడాల మధ్య సంబంధాలు దారుణంగా దిగజారాయి. ఆయన హత్య వెనుక భారత హస్తం ఉన్నదనే విశ్వసనీయ ఆరోపణలు ఉన్నాయని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పేర్కొనడంతో దుమారం రేగింది. ఈ వ్యవహారం ఇంకా వేడిగా ఉండగానే కెనడాలో ఖలిస్తానీ టెర్రరిస్టు సుఖ్‌దూల్ సింగ్ హత్య జరిగింది. కెనడాలో జరిగిన గ్యాంగ్ వార్‌లో నిన్న రాత్రి సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖా దునేకా హతమయ్యాడు. కెనడాలో ఖలిస్తానీ ఉద్యమంలో దునేకా యాక్టివ్‌గా ఉన్నాడు. అయితే.. సుఖ్‌దూల్ సింగ్ హత్యకు భారత్‌లో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహిస్తున్నట్టు ఓ ప్రకటన బయటకు వచ్చింది.
పాప్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసు, బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ హత్యా బెదిరింపుల ఉదంతాలు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను వార్తల్లో నిలిపాయి. సిద్దుమూసేవాలా కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. డ్రగ్ స్మగ్లింగ్ కేసులో అహ్మదాబాద్ జైలులో ఉననాడు. తాజాగా, కెనడాలో మరణించిన ఖలిస్తానీ టెర్రరిస్టు హత్యకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహిస్తున్నట్టు ఓ వార్త వచ్చింది. గ్యాంగ్‌స్టర్లు గుర్లాల్ బ్రార్, విక్కీ మిద్దుఖేరాల హత్యల వెనుక దునేకే కీలక పాత్ర పోషించాడని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేసింది. సుఖ్‌దూల్ సింగ్‌ను డ్రగ్ బానిస అని, సుఖ్‌దూల్ చేసిన పాపాలకు శిక్ష పడిందని పేర్కొంది. అంతేకాదు, వారి శత్రువులు భారత్‌లోనే కాదు.. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బతకలేరని వార్నింగ్ ఇచ్చింది.
Also Read: ఖలిస్తాన్ వేర్పాటువాది సుఖ్దూల్ సింగ్ దారుణ హత్య.. కెనడాలో ఘటన
దునేకా పంజాబ్‌లోని మోగాకు చెందిన గ్యాంగ్‌స్టర్. ఏ కేటగిరీ గ్యాంగ్‌స్టర్. ఫేక్ పాస్‌పోర్టుపై 2017లో కెనడాకు పారిపోయాడు. ఖలిస్తానీ టెర్రరిస్టు అర్షదీప్ దల్లాకు దగ్గరి సహచరుడిగా పేరుంది. యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ సెప్టెంబర్ 20వ తేదీన(నిన్న) ఓ లిస్టు విడుదల చేసింది. ఖలిస్తాన్, కెనడాకు సంబంధమున్న 43 మంది గ్యాంగ్‌స్టర్‌ల జాబితాలో సుఖ్‌దూల్ సింగ్ కూడా ఉన్నాడు.