మనుషుల్ని నగ్నంగా చూడొచ్చని... మ్యాజిక్ మిర్రర్ పేరుతో వృద్ధుడికి టోకరా..
మనుషుల్ని నగ్నంగా చూడొచ్చని, భవిష్యత్తు తెలుసుకోవచ్చని 72యేళ్ల వృద్ధుడిని నమ్మించి.. మ్యాజిక్ మిర్రర్ అంటూ అంటగట్టారు మోసగాళ్లు. అతని నుంచి రూ.9 లక్షలు గుంజారు.
ఉత్తర ప్రదేశ్ : పురాతన వస్తువుల పేరుతో 72 ఏళ్ల వృద్ధుడిని మోసం చేశారు కొంతమంది. మనుషులను నగ్నంగా చూడచ్చని చెబుతూ ఓ మాయ అద్దాన్ని అతనికి అంటగట్టారు. అవినాష్ కుమార్ అనే ఆ వృద్ధుడు వారు చెప్పిన మాటలను నమ్మి 9 లక్షలు మోసపోయాడు. పార్థసింగ్రే, మొలయా సర్కార్, సుదీప్తా సింహరాయ్ అనే ముగ్గురు వ్యక్తులు అవినాష్ కుమార్ ను కలిశారు.
తామంతా పురాతన వస్తువులు సేకరించే ప్రముఖ కంపెనీల్లో పని చేస్తున్నట్లుగా అవినాష్ కుమార్ తో పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ దగ్గర ఒక మాయా అద్దం ఉందని తెలిపారు. అందులో ఎవరిని చూసినా నగ్నంగా కనిపిస్తారని వృద్ధుడికి ఎరవేశారు. దీంతో పాటు భవిష్యత్తును కూడా అంచనా వేయొచ్చని నమ్మబలికారు.
దేశంలో అందుబాటులోకి తొలి త్రీడీ పోస్టాఫీస్ .. ప్రతీ భారతీయుడు గర్విస్తాడన్న ప్రధాని మోడీ
అవినాష్ కుమార్ కాస్త టెంప్ట్ అవుతున్నట్టు కనిపించగానే.. అది రెండు కోట్ల రూపాయల విలువైన అద్దమని.. తాము కేవలం రూ. 9 లక్షలకే ఇస్తామని మభ్య పెట్టారు. అయితే మొదట అవినాష్ కుమార్ ఈ విషయాన్ని నమ్మడానికి సందేహించాడు. తమ మీద అనుమానం రాకుండా నాసా శాస్త్రవేత్తలను కూడా వాడుకున్నారు.
నాసా శాస్త్రజ్ఞులతో సహా ఎంతోమంది ఈ మాయా అద్దాన్ని ఉపయోగించారని నమ్మబలికారు. చివరికి వారి బుట్టలో అవినాష్ కుమార్ పడ్డాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు వెళ్ళాడు అవినాష్ కుమార్. అక్కడ వారికి మాట్లాడుకున్న రూ.9 లక్షలు చెల్లించాడు. ఆ మాయా అద్దాన్ని తీసుకొని వచ్చాడు.
ఇంటికి వచ్చిన తర్వాత కానీ తాను మోసపోయిన సంగతి గుర్తించలేదు. అది మాయా అర్థం కాదు మామూలు అద్దమే అని.. మ్యాజిక్ మిర్రర్ పేరుతో.. తాను లక్షల రూపాయలు పోగొట్టుకున్నానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్న పోలీసులు.. పశ్చిమబెంగాల్లో నిందితులని అదుపులోకి తీసుకున్నారు.