దేశంలో అందుబాటులోకి తొలి త్రీడీ పోస్టాఫీస్ .. ప్రతీ భారతీయుడు గర్విస్తాడన్న ప్రధాని మోడీ
దేశంలోనే తొలి త్రీడి ప్రింటెడ్ పోస్టాఫీసు కర్ణాటక రాజధాని బెంగళూరులో అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లే ఔట్‌లో 1021 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. దీనిని చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.
దేశంలోనే తొలి త్రీడి ప్రింటెడ్ పోస్టాఫీసు కర్ణాటక రాజధాని బెంగళూరులో అందుబాటులోకి వచ్చింది. ఈ తపాలా కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి తిలకించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లే ఔట్‌లో 1021 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఆధునిక త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 45 రోజుల్లోనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం.
అదే సంప్రదాయ పద్ధతిలో నిర్మించి వుంటే 8 నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో ఎల్ అండ్ టీ సంస్థ దీనిని నిర్మించింది. ఈ త్రీడీ పోస్టాఫీస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనిని చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని.. స్వావలంబన స్పూర్తిని ఇది ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.