Asianet News TeluguAsianet News Telugu

‘2జీ’ ఆరోపణలు వెనక్కి.. కాంగ్రెస్ నేతకు మాజీ కాగ్ వినోద్ రాయ్ క్షమాపణలు

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కలకలం రేపిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కుంభకోణానికి సంబంధించి అప్పటి కాగ్ వినోద్ రాయ్ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్‌పై కాగ్ రిపోర్టులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును చేర్చవద్దని తనపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ తీవ్ర ఒత్తిడి తెచ్చారని వినోద్ రాయ్ ఆరోపణలు చేశారు. తాజాగా, ఆ ఆరోపణలపై వినోద్ రాయ్ యూటర్న్ తీసుకున్నారు.

former CAG vinod rai tender apology to congress leader related to 2g scam
Author
New Delhi, First Published Oct 28, 2021, 5:36 PM IST

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం యావత్ దేశాన్ని కుదిపేసింది. ముఖ్యంగా Congressను అతలాకుతలం చేసింది. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. తొలిసారి BJP సొంత మెజార్టీతో కేంద్రంలో అధికారానికి వచ్చింది. ఇంతటి తీవ్రత కలిగిన ఈ కుంభకోణానికి సంబంధించి అప్పటి కాగ్ Vinod Rai రిపోర్టు సంచలనానికి కేరాఫ్‌గా మారింది. ఆ CAG రిపోర్టు కాంగ్రెస్ నేతల పాలిట శాపంగా మారింది. అప్పుడు వినోద్ రాయ్ అప్పటి కాంగ్రెస్ ఎంపీ Sanjay Nirupamపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా యూటర్న్ తీసుకున్నారు.

వినోద్ రాయ్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో తాజాగా వినోద్ రాయ్ కోర్టులో బేషరతుగా క్షమాపణలు తెలిపారు. నోటరీ చేసిన అఫిడవిట్‌లో ఆయన చెప్పిన క్షమాపణలను కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ట్వీట్ చేశారు. 

Also Read: 2జీ స్పెక్ట్రం కేసు: ఆగ్రహించిన కోర్టు...15 వేల మొక్కలు నాటాలంటూ శిక్ష

2014లో వినోద్ రాయ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. 2G Sprectrum కేటాయింపుల రిపోర్ట్ నుంచి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరును చేర్చవద్దని తనపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ ఇంటర్వ్యూలు వినోద్ రాయ్ రాసిన ఓ పుస్తకం విడుదల సందర్భంలోనే ప్రసారమయ్యాయి.

బొగ్గు కేటాయింపులపై ఆడిట్ జరుగుతున్న సమయంలో కాంగ్‌గా వినోద్ రాయ్ బాధ్యతల్లో ఉన్నారు. ఆ ఆడిట్‌లో అవకతవకలు ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. అంతేకాదు, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్‌లోనూ దేశం లక్షల కోట్లను నష్ట పోయినట్టు ఆరోపణలకు ఆధారమైన రిపోర్టు కూడా వినోద్ రాయ్‌దే.

‘నా ప్రకటనతో జరిగిన నష్టాన్ని అర్థం చేసుకున్నా.. ’

ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీతో నోటరీ చేసిన తన క్షమాపణల అఫిడవిట్‌లో వినోద్ రాయ్ ఈ విధంగా పేర్కొన్నారు. 2014 సెప్టెంబర్‌లో మీడియాకు తాను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నిరుపమ్‌ పేరును తప్పుగా వినియోగించానని వివరించారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరును కాగ్ రిపోర్టు నుంచి తొలగించాలని తనపై ఒత్తిడి తెచ్చినట్టు ఆయన పేరును అనుకోకుండా ప్రస్తావించినట్టు తెలిపారు. తన ప్రకటనల ప్రసారాలు పాక్షికంగా అవాస్తవాలని అంగీకరించారు. తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్‌కు కలిగిన నష్టాన్ని, బాధను అర్థం చేసుకున్నారని వివరించారు. అందుకే బేషరతుగా తాన క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు. తన క్షమాపణలను సంజయ్ నిరుపమ్ స్వీకరిస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంతటితో ఈ ఇష్యూను క్లోజ్ చేయాలని కోరారు. 

ఆ నాన్‌సెన్స్‌పై నాకే కాదు..  దేశానికీ క్షమాపణలు చెప్పాలి..

వినోద్ రాయ్ క్షమాపణల పత్రాన్ని ట్వీట్ చేసిన తర్వాత సంజయ్ నిరుపమ్ ఓ వీడియో స్టేట్‌మెంట్ పపోస్టు చేశారు. వినోద్ రాయ్ క్షమాపణలను స్వాగతిస్తున్నారని, ఇది గోల్డెన్ డే అని పేర్కొన్నారు. అంతేకాదు, 2014లో ఆయన చేసిన ప్రకటనలను ఉపసంహరించుకోవాలని కోరారు. కానీ, అందుకు వినోద్ రాయ్ అంగీకరించలేదు. 

Also Read: 2 జి స్కాం: అబ్బుర పరిచే 11 వాస్తవాలు

ఈ వీడియోలో వినోద్ రాయ్ ఇతర రిపోర్టులనూ సంజయ్ నిరుపమత్ తప్పుపట్టారు. కోల్ బ్లాక్, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై వినోద్ రాయ్ సమగ్ర రిపోర్టులన్నీ ఫేక్ అని అన్నారు.

‘కోర్టు ఈ విషయాన్ని అనలేదు.. కానీ, నేను చెప్పేదేమంటే.. 2జీ కేటాయింపులు, కోల్ బ్లాక్ కేటాయింపులపై ఆయన రూపొందించిన రిపోర్టులన్నీ నాన్‌సెన్స్’ అని చెప్పారు. 2జీ రిపోర్టు గురించి మాట్లాడితే, ఏడేళ్ల విచారణ తర్వాత ఈ స్కామ్‌లో సీబీఐ ఆధారాలేవీ చూపించలేకపోయిందని న్యాయమూర్తే స్పష్టం చేశారని వివరించారు. ఆ రిపోర్టులు ఫేక్ అని ఆరోపించారు. బొగ్గు గనుల కేటాయింపులపైనా ఆయన రూపొందించిన రిపోర్టు అవాస్తవమైనదే అని అన్నారు. వినోద్ రాయ్ కేవలం తనకే కాదు.. యావత్ దేశానికే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios