Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri case: ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. ఆ ఇద్దరి గన్స్‌ నుంచి కాల్పులు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా, సహా నిందితుడు అంకిత్ దాస్‌లు.. హింసాకాండ సందర్భంగా వారి లైసెన్స్‌డ్ గన్స్ (licensed guns) నుంచి కాల్పులు జరిపినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ధ్రువీకరించింది.

Forensic report says Ashish Mishra Ankit Das weapons were fired during Lakhimpur Kheri violence
Author
New Delhi, First Published Nov 9, 2021, 1:11 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో (Lakhimpur Kheri) జరిగిన హింసకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక‌లో సంచనల విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి Ajay Mishra కుమారుడు ఆశిష్ మిశ్రా, సహా నిందితుడు అంకిత్ దాస్‌లు.. హింసాకాండ సందర్భంగా వారి లైసెన్స్‌డ్ గన్స్ నుంచి కాల్పులు జరిపినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ మంగళవారం ధ్రువీకరించింది. ఈ మేరకు ఇండియా టూడే రిపోర్ట్ చేసింది. లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి అంకిత్ దాస్, ఆశిష్ మిశ్రాల నుంచి రివాల్వర్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్టోబర్ 15న వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. అయితే లఖింపూర్ ఖేరీ హింసాకాండ సమయంలో ఆశిష్ మిశ్రా, అంకిత్ దాస్‌లు పలు రౌండ్ల కాల్పులు జరిపారని రైతులు ఆరోపించిన సంగతి తెలిసిందే. 

ఇక, ఈ కేసుకు సంబంధించి Uttar Pradesh ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాము ఆశించిన స్థాయిలో దర్యాప్తు జరగడం లేదని  సీజేఐ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అందుకే ఈ కేసులో Charge Sheet దాఖలయ్యే వరకు ఇతర రాష్ట్రాల హైకోర్టు మాజీ న్యాయమూర్తి దర్యాప్తును పర్యవేక్షించడం సమంజసంగా తోస్తున్నదని వివరించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్‌ల పేర్లను సూచించింది. వీడియో సాక్ష్యాలకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక అందించడంలో ఆలస్యాన్ని ప్రశ్నించింది.  అంతేకాదు, కేసులోని ప్రధాన నిందితుడిని రక్షించేలా చర్యలు జరుగుతున్నట్టు అనుమానాలు వస్తున్నాయని తెలిపింది.

Also read: ఆ నిందితుడిని రక్షించడానికేనా?.. లఖింపూర్ ఖేరి కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం

విచారణను సీబీఐకి బదిలీ చేసేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన న్యాయ కమిషన్‌ను కొనసాగించడం తమకు ఇష్టం లేదని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లను కలిపే నిర్ణయంలో దురుద్దేశ్యాలు ఉన్నట్టు సుప్రీంకోర్టు అనుమానించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అశిశ్ మిశ్రాను కాపాడే లక్ష్యంతోనే రెండు ఎఫ్ఐఆర్‌లను కలుపుతున్నట్టు అభిప్రాయపడింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. 

Lakhimpur Kheri: 23 మంది సాక్షులేనా? ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Lakhimpur Kheri‌లో అక్టోబర్ 3వ తేదీన మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి  Ajay Mishra కుమారుడు  అశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు కారణమైన అశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రైతులను ఢీ కొట్టిన ఎస్‌యూవీ డ్రైవింగ్ సీటులో మంత్రి కొడుకు ఉన్నాడని మృతుల కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios