షాక్: 'అభిమన్యుడు' సినిమా తరహలోనే రైతు సొమ్ము స్వాహా

Five bank staff swindle Rs 12 lakh from farmer's loan a/c, booked
Highlights

రైతుల సొమ్ము స్వాహా చేసిన బ్యాంకు సిబ్బంది


చెన్నై: విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమాలో  మాదిరిగానే ఓ రైతు పొదుపు ఖాతాలోని సొమ్మును బ్యాంకు అధికారులు స్వాహా చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని  పుదుకోట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని పుదుకోట జిల్లా చోళగంపట్టి గ్రామానికి చెందిన రామదాసు అనే రైతు బ్యాంకు ఖాతా నుండి బ్యాంకు అధికారులు రూ. 12.48 లక్షలను స్వాహా చేశారు.  విశాల్ నటించిన అభిమన్యుడు సినిమాలో  ఓ ఖాతాదారుడి సంతకంతో ఏ రకంగా డబ్బులు కొట్టేశారో అదే తరహలో  రైతు ఖాతా నుండి కూడ బ్యాంకు అధికారులు డబ్బులను స్వాహా చేశారు.

రామదాస్‌ వ్యవసాయ రుణం కోసం పుదుకోటలో ఉన్న ఓ బ్యాంక్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. తన ఇంటిని రూ.14 లక్షలకు తనఖా పెట్టి రుణం తీసుకున్నాడు. రుణం మంజూరు కోసం రామదాస్‌కు పాస్‌బుక్‌, చెక్కులను బ్యాంక్‌ అధికారులు ఇచ్చారు. 

లోన్ మంజూరు చేసే సమయంలో రామదాస్‌ నుండి ఓ బ్లాంక్‌ చెక్కుపై బ్యాంకు అధికారులు సంతకం తీసుకొన్నారు. బ్యాంక్‌ రూల్స్‌ ప్రకారం రుణం వాయిదాలు సక్రమంగా చెల్లించకపోతే ఆ చెక్కులో బకాయి సొమ్మును రాసి రుణాన్ని వసూలు చేస్తామన్నారు. బ్యాంక్‌ అధికారుల మాటలను నమ్మి రామదాస్‌ వారికి బ్లాంక్‌ చెక్కును ఇచ్చాడు.

రామదాసుకు బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేశారు.  అయితే రుణం మంజూరైన రెండు రోజులకే తన ఖాతాలో రూ. 12.48 లక్షలను ఎవరో డ్రా చేశారని బాధితుడు ఆందోళన చెందారు. వెంటనే బ్యాంకులో ఆరా తీశారు. 

రాందాస్‌ చెక్కు రూపంలో ఆ నగదును తంజావూరు బ్యాంక్‌లో ఖాతా ఉన్న మారిముత్తుకు బదిలీ చేశారని సమాధానమిచ్చారు. దీంతో దిగులు చెందిన రామదాస్‌ పుదుకోట క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బ్యాంక్‌ వ్యవసాయ రుణాల విభాగం మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పేరెయిలన్‌‌ను అరెస్టు చేశారు. ఈ మోసం కేసుకు సంబంధించి మరో ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

loader