దేశంలో వరుస అగ్నిప్రమాదాలు భయపెడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించిన ఘటనను మరిచిపోకముందే అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
పంజాబ్‌లోని ఆధ్యాత్మిక పట్టణం అమృత్‌సర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే.. ఓపీడీ సమీపంలో ఈరోజు పెద్ద పేలుడు సంభవించింది. అనంతరం సమీపంలోని భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే అది స్కిన్ , కార్డియాలజీ వార్డుకు కూడా వ్యాపించింది. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఓపీడీ సమీపంలో ఏర్పాటు చేసిన రెండు ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్‌లలో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయని ఆసుపత్రి ప్రిన్సిపల్ తెలిపారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం కానీ ఎవరికీ గాయాలు కానీ కాలేదని ఆయన వెల్లడించారు. కాగా.. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌లో దాదాపు వెయ్యి లీటర్ల నూనె వుంటుంది. తీవ్రమైన వేడి కారణంగా వాటిలో ఒక్కోసారి మంటలు చెలరేగుతూ వుంటాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
కాగా.. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం నుంచి 50 మందికి పైగా రక్షించబడ్డారు. తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగించిన ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 27 మందిని పొట్టనబెట్టుకున్న ముండ్కా అగ్నిప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యుత్ పేలుడు కారణంగానే ఈ ఘటన జరిగిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారి తెలిపారు. విద్యుత్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. శిథిలాలలో అనేక కాలిపోయిన అవశేషాలు కనుగొనబడినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. శుక్రవారం ముండ్కాలో మంటలు చెలరేగిన వాణిజ్య భవనంలో చాలా పెద్ద లొసుగులు ఉన్నాయని అతుల్ గార్గ్ తెలిపారు. భవనం ఫైర్ సేప్టీ, NOC లేదని గార్గ్ చెప్పారు. బయటకు వెళ్లేందుకు ఒక్క ద్వారం మాత్రమే ఉందన్నారు. అలాగే, అగ్నిమాపక రక్షణ లేదని పేర్కొన్నారు. అంతేకాదు, ఒకే గదిలో 50-60 మంది ఉన్నారని, గది బయటి నుంచి తాళం వేసి ఉందని తెలిపారు.
కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక శాఖ నుంచి సేఫ్టీ క్లియరెన్స్ లేని ఈ భవనానికి లేదని గుర్తించారు. దీని యజమాని మనీష్ లాక్రాగా గుర్తించామని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగినప్పుడు రెండవ అంతస్తులో ఓ ప్రసంగ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. అందువల్ల అత్యధిక మరణాలు ఈ అంతస్తులోనే జరిగాయని ప్రాథమిక విచారణలో తేలింది.
