ఢిల్లీ సరిహద్దులో ఏడాదిపాటు పట్టు సడలకుండా రైతులు ఉద్యమం చేసి ఇటీవలే వెనుదిరిగారు. అయితే, తమ ఉద్యమ కాలంలో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలను వారు విశ్వసించలేదు. అలాంటి అభిప్రాయాల నుంచే తామే స్వయంగా ఎన్నికల రాజకీయాల్లోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారు. అలాంటి నిర్ణయాల నుంచే తాజాగా, రైతు నేత గుర్నామ్ సింగ్ చాదుని సంయుక్త సంఘర్ష్ పార్టీని ప్రకటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు.
చండీగడ్: రైతుల ఉద్యమం(Farmers Movement)తో Punjab రాష్ట్రం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో పంజాబ్ గురించి ముఖ్యంగా పంజాబ్ రైతుల ప్రత్యేకతల గురించి రకరకాలుగా చర్చించుకున్నారు. అనుకున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వంపై పోరాడి మూడు సాగు చట్టాల రద్దు డిమాండ్‌ను సాధించిన రైతులు ఇప్పుడు స్వస్థలానికి తిరిగి వెళ్లిపోయారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలూ(Assembly Elections) వీరి ఉద్యమ నేపథ్యంలో చర్చకు వచ్చాయి. రైతులు వెనుదిరిగినా.. వారి ఉద్యమం ఆగబోదని ఇప్పటికే పలువురు రైతు నేతలు ప్రకటించారు. అదీగాక, ఏడాదిపాటు పోరాడిన రైతుల్లోనూ ప్రస్తుత ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలపై నమ్మకం సడలిపోయింది. అందుకే సొంతంగా ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్లాలనే అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇలాంటి తరుణంలో రైతు ఉద్యమం నేత గుర్నామ్ సింగ్ చాదుని(Gurnam Singh Chaduni) కీలక ప్రకటన చేశారు. ఈ రోజు ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
రైతు ఉద్యమ నేత గుర్నామ్ సింగ్ చాదుని ఈ రోజు చండీగడ్‌లో కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు. దాని పేరు సంయుక్త సంఘర్ష్ పార్టీగా నామకరణం చేశారు. ఈ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. సంయుక్త సంఘర్ష్ పార్టీ పంజాబ్ రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా రాజకీయ పార్టీల్లో ధనికులే ఉన్నారని అన్నారు. మన దేశంలో పెట్టుబడిదారి విధానం క్రమంగా ఇంకా పెరుగుతూనే ఉన్నదని వివరించారు. అందుకే పేదలు, ధనికుల మధ్య తేడా పెరుగుతూ ఉన్నదని తెలిపారు. సంపన్నులు పేదల కోసం విధానాలు రూపొందిస్తున్నారని చెప్పారు.
Also Read: రైతుల కొత్త రాజకీయ పార్టీ.. చండీగడ్‌లో రేపు గుర్నాం చాదుని కీలక ప్రకటన!
సంయుక్త సంఘర్ష్ పార్టీ అన్ని కులాలు, మతాలకు అతీతంగా ఉంటుందని గుర్నామ్ సింగ్ చాదుని వెల్లడించారు. తమ పార్టీ లౌకిక పార్టీ అని వివరించారు. ఈ పార్టీ అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి అని తెలిపారు. పట్ణణ, గ్రామీణ కార్మికులు, కర్షకుల కోసం తమ పార్టీ అని చెప్పారు. ఢిల్లీ సరిహద్దులో ఇప్పుడు రద్దు చేసిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాది పాటు ఉద్యమం చేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పంజాబ్ రైతులే ఇందులో అధికంగా ఉన్నారు.
Also Read: New Farm laws: సుదీర్ఘ నిరసనకు ముగింపు, సింఘి, టిక్రీ సరిహద్దుల నుండి స్వస్థలాలకు రైతులు
తమ డిమాండ్లను సాధించుకోవడానికి 32 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా నడుచుకున్న విధానం అందరినీ ఆకట్టుకున్నది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ, పరిస్థితులు అదుపు తప్పినప్పుడూ ఎస్‌కేఎం స్పష్టంగా వైఖరి వెల్లడిస్తూ.. పట్టుసడలకుండా వ్యవహరించింది. సంక్షోభ పూరిత వాతావరణంలోనూ రైతు ఉద్యమం నెగ్గి నిలవడానికి ఎస్‌కేఎం అవలంబించిన విధానాలు ఆదర్శంగా సాగాయి. ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ రైతుల డిమాండ్‌ను అంగీకరించి.. తర్వాత కేంద్రం పార్లమెంటులో ఆ మూడు చట్టాలను రద్దు చేయడంతో రైతులు వెనుతిరిగారు.
